Sirivennela Seetharama Sastry Death: చైతన్యాన్ని తట్టిలేపే సిరివెన్నెల టాప్‌ సాంగ్స్..

First Published Nov 30, 2021, 5:13 PM IST

సిరివెన్నెల హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని షాక్‌కి గురి చేసింది. పాటల ప్రవాహం ఆగిపోయిందంటూ సినీ ప్రముఖులే కాదు, శ్రోతలు సైతం చలించిపోతున్నారు. సినీ వినీలాకాశంలో మకుటం మహరాజులా వెలిగిన సిరివెన్నెల రాసిన టాప్‌ సాంగ్స్ చూద్దాం. 
 

తెలుగు చిత్రసీమలో వెలసిన పాటలతోటలో `సిరివెన్నెల` కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించే సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా సీతారామశాస్త్రి పాటల సందడిలోకి ఓ సారి తొంగిచూశామో, ఆ పాటల మాధుర్యం తలపుల మునకలో అంత త్వరగా తెలవారదు.

తన పాటలతో మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలేన్నో వేశాడు. శాస్త్రీయ గీతమైనా, ప్రణయ గీతమైనా, సందేశాత్మక గీతాలైనా, ఇలా ఏరకమైన గీతాలైనా  ఆయన కలం నుంచి ఆశువుగా జాలువారాయి.  `ఆదిభిక్షువు వాడినేమి కోరేది  బూడిదిచ్చే వాడినేమి అడిగేది` అంటూ పరమశివుని తత్వాన్ని చాటిన అపర సాహితి ఋషి సిరివెన్నెల. ఒకసారి ఆయన రాసిన `గంగావతరణం` అనే గేయాన్నిచూసిన కళాతపస్వీ కె.విశ్వనాథ్  సీతారామశాస్రీ ని `సిరివెన్నెల` మూవీ తో వెండితెరకు పరిచయం చేసాడు.

అలాగే `ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అంటూ ...` మొదటగా ముందడుగు నీవెయ్యి.. నీ వెనుకే సమాజం వస్తుంది అని చెప్పాడు. రాసిన ప్రతీ పాటలో విలువైన పదాన్ని పొదిగి ఆ గీతానికి విలువను ఆపాదించడంలోనూ శాస్త్రీ స్టైలే వేరు.

`నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని...నిప్పుతోని కడుగు ఈ సమాజ జీవచ్ఛావాన్ని` అంటూ `గాయం` చిత్రంలో తన సాహిత్యంతో `మారదు లోకం మారదు కాలం` అంటూ సమాజంలో ఉన్న కుళ్లును తన కలంతో కడిగిపారేసాడు. ఈ మూవీలో కనిపించి వినిపించాడు సీతారామశాస్త్రీ.

‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’..అంటూ ‘చక్రం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయనలోని తాత్వికుడ్ని మన ముందు ఆవిష్కరించింది. కవినై...కవితనై...భార్యనై...భర్తనై...అన్ని తానే అంటాడు. అందరు ఉన్న నా జీవితం ఒంటరి అన్నాడు ఈ పాటలో.. పాటను అర్థం అయ్యేలా రాయనక్కర్లేదు. అర్ధం చేసుకునే కోరిక పుట్టేలా రాసి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి శాస్త్రీ.

`స్వర్ణకమలం` మూవీలో ఆయన రాసిన `ఓం నమో నమ: శివాయ` అంటూ ఆయన రాసిన పదాలు ఓంకారనాదం లా మన చెవుల్లో ఇప్పటికీ ఝుమ్మంటునే ఉన్నాయి. `అందెల రవళికి పదముల తానై` అనే చరణానికి.. నాట్యానానికి , నటరాజ స్వామికి మధ్య బంధాన్ని తన కలంతో పండిత పామర జనరంజకంగా రాసి ఇటువంటి గీతాలలో తనకు తిరుగులేదని పించుకున్నాడు.‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదు భర్తకు మారకు బ్యాచిలరు’ అని పాడుకేనే ఆధునిక బ్రహ్మచారుల శైలీని అద్ధం పట్టింది. కామెడీ పాటలను రాయడంలో తనకు సాటిరారని నిరూపించుకున్నాడు శాస్త్రీ.

`ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం…` అంటూ పండితుల ప్రశంసలు పొందిన సీతారాముని కలం, `తెల్లారింది లెగండోయ్… కొక్కురోకో…` అంటూ పల్లవించి పామరులకు మేలుకొలుపు పాడింది. `తెలవారదేమో స్వామీ… నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలవేలు మంగకూ…` అంటూ పదమందుకుంటే పదకవితాపితామహుడే మళ్ళీ దిగివచ్చాడా అనిపించింది. 

కొంత మంది ఇంటి పేరు కాదుర గాంధీ...ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. అంటూ బాపూజీ అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ‘ఎంత వరకు ఎంత వరకు’ అంటూ గమ్యంలో ఆయన రాసిన గేయంలో.. సమాజంలో ఉన్న గాయాలను కళ్లకు కట్టినట్లు చూపాడు. తెలుగులో దాదాపు అందరి హీరోలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.  2019 ఏడాదికి గాను కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి.
 

`అందెల రవమిది పదములదా…` అంటూ ఆరంభించగానే శ్రోతల ఆనందం అంబరమంటింది. వీధుల్లో విప్లవించే గళంలా కనిపిస్తూ, వేదంలోని నాదాన్ని వినిపిస్తూ, `దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని…` అంటూ భరోసానూ ఇచ్చింది సిరివెన్నెల కలం. నీదీ నాదీ అంటూ ఏదీ లేదు ఉన్నదంతా ఒక్కటే, అది అందుకోవాలంటే `జగమంత కుటుంబం నాదీ…ఏకాకి జీవితం నాది…` అన్న సత్యాన్నీ తెలిపింది. ఇందులో విరాగం కనిపించినా, యువతకు ప్రోత్సాహమిచ్చేలా “ఎందుకొరకు… ఎంతవరకు…” అంటూ కోరుకున్న ‘గమ్యం’వైపు సాగమనీ సీతారాముని కలం బోధించింది. పరికించి చూస్తే ఈ సిరివెన్నెలలో ఎన్నెన్నో జీవితసత్యాలు దొరుకుతాయి. వాటిని ఏరుకొనే ప్రయత్నంలోనే ఎందరో సీతారాముని పాటను పట్టుకొని, తెలుగు సినిమా పాటలతోటలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు.

sirivennela

సిరివెన్నెల చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌`లో `దోస్తి` పాటని రాశారు. అదిఇప్పటికే విడుదలై విశేషశ్రోతకాదరణ పొందింది. అంతకు ముందు `అల వైకుంఠపురములో` `సామజవరగమన` పాటని రాశారు. ఇది మిలియన్స్ వ్యూస్‌ని పొందిన విషయం తెలిసిందే. చివరి వరకు పాటల్లోనే బతికారు. తన పాటల్లో చిరంజీవిగానే ఉంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. 

also read: Sirivennela Seetharama Sastry Death: పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు..
 

click me!