మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. వాల్తేరు వీరయ్య లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి ఒక రీమేక్ చిత్రాన్ని ఎంచుకున్నారు. భోళా శంకర్ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. బిల్లా లాంటి స్టైలిష్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన మెహర్ రమేష్ ప్రతిభవంతుడిగా గుర్తింపు పొందారు.
కానీ ఆ తర్వాత శక్తి, షాడో లాంటిచిత్రాలతో మెహర్ రమేష్ కెరీర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ఈ తరుణంలో చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని కూడా మెహర్ సద్వినియోగం చేసుకోలేదు. ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి భోళా శంకర్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే మెహర్ రమేష్ క్రియేటివ్ లోపం తో పాటు రీమేక్ చిత్రాలకు కాలం చెల్లిందనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలని నెటిజన్లు అంటున్నారు.
పదిహేనేళ్ల క్రితం లాగా ఇప్పుడు రీమేక్ చిత్రాలు వర్కౌట్ కావడం లేదు. అప్పట్లో డిజిటల్, ఓటిటి మాధ్యమాలు లేవు. కానీ ఇప్పుడు ఏ భాషలో సినిమా విడుదలైనా నాలుగు వారాల్లోపే ఓటిటిలోకి అన్ని భాషల్లో అందుబాటులో ఉంటోంది. ఇలాంటి పరిసస్థితుల్లో రీమేక్ చిత్రాలని ఎంచుకోవడం అంటే పెద్ద సాహసమే అని అంటున్నారు. ఒక వేళ రీమేక్ లు చేసినా పూర్తిగా రీక్రియేట్ చేసి దర్శకుడు మ్యాజిక్ చేయాలి అని అంటున్నారు.
కొన్ని వారాల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు భోళా శంకర్ కి కూడానా మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. చిరు చివరగా వాల్తేరు వీరయ్య అనే స్ట్రైట్ స్టోరీ ఎంచుకున్నారు. ఆల్ టైం రికార్డు అనిపించే స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధించింది. ఇక్కడే రిమేక్ చిత్రాలకు, స్ట్రైట్ మూవీస్ కి తేడా తెలిసిపోతోంది అని ఫ్యాన్స్ సైతం అంటున్నారు.
పవన్ కళ్యాణ్ బ్రో చిత్రాన్ని ఎంపిక చేసుకునే సమయంలో, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రారంభించే సమయంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. రీమేక్ మూవీస్ వద్దని ఫ్యాన్సే గోల చేస్తున్నారు. ఆల్రెడీ ఓటిటిలో అవైలబుల్ గా ఉన్న సినిమాలని రీమేక్ చేయడం తెలివైన నిర్ణయం కాదని అంటున్నారు.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా రీమేక్ కాదనేది ఆ చిత్ర యూనిట్ వాదన. ఏది ఏమైనా రిమేక్ చిత్రాలకు పూర్తిగా కాలం చెల్లింది అని బ్రో, భోళా శంకర్ చిత్రాలు నిరూపించాయి.