
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా `ది గర్ల్ ఫ్రెండ్` చిత్రంలో నటించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధీరణ్ మొగిలినేని, దివ్య నిర్మించారు. దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. రష్మిక మందన్నా నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అదే సమయంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. దీనికి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో రష్మిక మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ, మనలైఫ్‌లో విజయ్ దేవరకొండ లాంటి వారు ఉండటం ఒక వరం అని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ లాంటి వారు ఉండాలని ఆమె చెప్పడం విశేషం. విజయ్ తనని మొదటి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నాడని, ఈ సినిమా విజయంలోనూ భాగస్వామి అయ్యాడని, ఈ సినిమా మొత్తం జర్నీలో తన వెంటే ఉన్నాడని, అన్ని రకాలుగా అండగా నిలిచాడని తెలిపింది రష్మిక. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పింది.
ఆమె ఇంకా చెబుతూ, ఈ స్టోరీ విన్న వెంటనే తప్పకుండా చేయాలనిపించిందని, ఎందుకంటే భూమా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తనకూ ఎదురైనట్టు తెలిపింది రష్మిక. సాధారణంగా ఒక కథ, సీన్‌కి ఎంత ఎమోషన్స్ చూపించాలో, అంతే చూపిస్తాం. కానీ మొదటిసారి తన మనసులో , ఆత్మలో ఏముందో అదంతా చూపించినట్టు, ఇదొక బెస్ట్ మూవీ అని, ఇలాంటి కథను అందరు చూడాలని తీసుకొచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమా ఎన్ని అవార్డులు వస్తాయో తెలియదు, కానీ ఆడియెన్స్ దీన్ని పక్కన పెట్టకుండా ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే తనకు పెద్ద అవార్డుగా భావిస్తున్నానని తెలిపింది రష్మిక మందన్నా. మాట్లాడే క్రమంలో ఆమె ఎమోషనల్ అయ్యింది.
ఇందులో గెస్ట్ గా పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎవరి లైఫ్‌లో అయితే ఇలాంటివి జరుగుతున్నాయో, ఇలాంటివి ఫేస్ చేశారో, అది ఏ సందర్భంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఆ విషయంలో బాధగా ఉంది. మన పార్టనర్‌కి రక్షణగా ఉండాలని మనందరికి ఒక భావన ఉంటుంది. అది వాళ్లని కంట్రోల్ చేసేదిగా ఉండకూడదు. వాళ్ల కలలకు, సంతోషాలకు రక్షణగా ఉండాలి. ఇద్దరి జీవితంలో ఎన్ని మంచి మెమొరీస్ ఉన్నాయనేది ముఖ్యం. పుట్టడం, చనిపోవం మన ఛాయిస్ కాదు, కానీ ఏం చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన ఛాయిసెస్ మన జీవితాన్ని మార్చేస్తాయి. లైఫ్ చాలా సింపుల్‌గా, సరదాగా ఉండాలి` అని తెలిపారు.
రష్మిక గురించి చెబుతూ, `రషిని `గీత గోవిందం` నుంచి చూస్తున్నా, ఆమె ఒక భూమాదేవినే. ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు తనని తానుగా బలమైన స్క్రిప్ట్ లు ఎంచుకునే స్థాయికి వచ్చింది. రషి జర్నీ చూస్తుంటే గర్వంగా ఉంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే రివర్స్ లో వాళ్ల మీదకు వెళ్తాను. కానీ రష్మిక ఎవరెన్ని మాటలు అన్నా, వాటిని పట్టించుకోకుండా ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతూనే ఉంది. ఎంతో దయతో ఉంటుంది. ఈ విషయంలో రష్మిక నువ్వు నిజంగా చాలా అమేజింగ్` అని అన్నాడు విజయ్. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాతలు, టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లకు అభినందనలు తెలిపారు విజయ్. ముఖ్యంగా రోహిణి పాత్రకి ఫిదా అయినట్టు, చాలా ఎమోషనల్‌కి గురైనట్టు తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ రష్మిక చేయికి కిస్ చేయడం హైలైట్‌గా నిలిచింది.