
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, భారతీయ సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాల్లో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న `గ్లోబ్ ట్రోటర్` ముందు వరుసలో ఉంటుంది. ఈ మూవీ నుంచి త్వరలో టైటిల్, టీజర్‌ని విడుదల చేయబోతున్నారు రాజమౌళి. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రని పరిచయం చేశారు. ఆయన కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీల్ చైర్‌లో కూర్చొని కోపంగా చూస్తున్న పృథ్వీరాజ్ లుక్ ఆకట్టుకుంది. ఆ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్లు ఉన్నాయా అనే సందేహాలను రేకెత్తించింది.
ఆ తర్వాత మంగళవారం `గ్లోబ్ ట్రోటర్` సినిమాలోని హీరో పాత్రని తెలియజేసేలా పాటని విడుదల చేశారు. ఈ పాటని శృతి హాసన్ పాడటం విశేషం. ఈ పాట సైతం ఆద్యంతం కట్టిపడేసింది. ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చింది. కీలక పాత్రలో నటిస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పాత్రని పరిచయం చేశారు. ఆమె మందాకిని పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు రాజమౌళి.
ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఇందులో `ప్రపంచ వేదికపై భారతీయ సినిమాని పునర్నిర్వచించిన మహిళ, మన అమ్మాయికి తిరిగి స్వాగతం. మందాకినిగా మీ విభిన్నమైన ఛాయలను ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను` అని పేర్కొన్నారు రాజమౌళి. ఫస్ట్ లుక్‌తోనే ఆమె పాత్రపై అంచనాలను పెంచారు. అదే సమయంలో ఆయన ప్లాన్ ఊహకందని విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లుక్‌లో ప్రియాంకచోప్రా చీరకట్టుకుని ఉంది. హై హీల్స్ ధరించింది. చేతిలో తుపాకీతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఏడారి, కొండల ప్రాంతంలో ఆమె ఈ రకమైన సాహసం చేస్తూ కనిపించడం విశేషం. దీంతో ఈ లుక్ ఊహకందని విధంగా ఉందని చెప్పొచ్చు.
అయితే ఆమె పాత్రని బట్టి చూస్తే, ప్రియాంక చోప్రా రోల్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మందాకిని పురాణాలకు సంబంధించిన పాత్రతో పోల్చితే మందాకిని రావణుడి సోదరి, అగస్త్యుడి భార్య. రాముడు, సీత వనవాసంకి వచ్చినప్పుడు వారికి హెల్ప్ చేసే పాత్ర మందాకినిది. ఈ లెక్కన చూస్తే సినిమాలో పైకి నెగటివ్ షేడ్‌తో కనిపించినా, హీరోకి సపోర్ట్ చేసే పాత్రలో ప్రియాంక చోప్రా కనిపిస్తుందని తెలుస్తోంది. ఆమె పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని రాజమౌళినే తెలిపారు. రామాయణంలోని మందాకిని పాత్ర తరహాలో ప్రియాంక పాత్ర జర్నీ ఉంటుందనిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వెనకాల చాలా కథ ఉందని మాత్రం అర్థమవుతుంది.
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న `గ్లోబ్ ట్రోటర్` మూవీని ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందిస్తున్నారని, ఇందులో మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన పాటలోనూ సంచారి అంటూ వర్ణించారు. ఈ పాట ఆయన పాత్ర తీరుతెన్నులను మరింతగా రిఫ్లెక్ట్ చేసిందని చెప్పొచ్చు. కొంత జేమ్స్ బాండ్ తరహాలో, మరికొంత ఇండియా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందనిపిస్తోంది. ఇలా అన్నీ మిక్స్ చేసి సరికొత్తగా ఈ మూవీని రూపొందిస్తున్నారట రాజమౌళి. అయితే ఈ సినిమాకి `వారణాసి` అనే టైటిల్ వినిపిస్తుంది. ఇదే టైటిల్ నిజమైతే భారతీయ పురాణాల నేపథ్యం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఇలా అనేక సస్పెన్స్ అంశాలతో మూవీపై అంచనాలను పెంచుతున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు రాజమౌళి. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. అందులో ఈ సినిమా గురించి అన్ని విషయాలు చెప్పబోతున్నారు. అదే సమయంలో టైటిల్ టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. దీంతో దీనికోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. దీనికంటే ముందే మహేష్ ఫస్ట్ లుక్ కూడా రాబోతుంది. దీని కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.