
‘కన్నప్ప’ సినిమా కోసం దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈసినిమా అంతా ఎక్కువ భాగం న్యూజిలాండ్ లోనే చిత్రీకరించారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి స్టార్స్ ను ఇందులో భాగం చేశారు. అంతకు మించి ప్రభాస్ ఈసినిమాలో నటించడం కన్నప్పకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.
ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కన్నప్పలో సందడి చేశారు. అయితే ఈసినిమా భారీ అంచనాలు, భారీ పబ్లిసిటీ నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రెండు మూడు రోజులు బాగానే నడించింది. ఆతరువాత ఈమూవీకి పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే ఎప్పుడు నటుడిగా ట్రోల్ అవుతూ వచ్చిన ఈ హీరో, ఈసారి మాత్రం తన సత్తా చాటాడు. ఇక కన్నప్ప అనుకున్నట్లే అంచనాలు అందుకోవడంతో మంచు విష్ణు, ఇప్పుడు తన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ పై కన్నేశాడు.
కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కాని.. ఓ మోస్తరు విజయం సాధించి మంచు ఫ్యామిలీకి ఊరటనిచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందనే చెప్పాలి. ఇక కన్నప్పతో పాటు మంచు విష్ణు మదిలో ఉన్న మరో సినిమా ‘రామాయణం’. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని దానిపై దృష్టి సారించాడు టాలీవుడ్ హీరో. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తోంది.
మంచు విష్ణు ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర వెల్లడించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి బయటకు వచ్చిన వివరాల ప్రకారం, రామాయణం సినిమా స్క్రిప్ట్‌ను ఆయన 2009లోనే సిద్ధం చేశారు. ఈసినిమా కోసం హీరోను కూడా ఫిక్స్ అయ్యారట టీమ్. అయితే భారీ బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని సమాచారం. ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్‌కి మరల జీవం పోసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
అప్పట్లో ఈసినిమాకు సబంధించి ప్రయత్నాలు గట్టిగా చేశారట మంచు విష్ణు. అయితే ఆటైమ్ లో భారీ బడ్జెట్ పెట్టే సాహసం చేయలేక, పక్కా ప్రణాళికతో వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం ఈసినిమాలో హీరోగా రాముడి పాత్ర కోనసం తమిళ స్టార్ హీరో సూర్యను కూడా సంప్రదించారని సమాచారం. అంతే కాదు ఈసినిమాలో నటించడానికి మిగతా తారాణగం కూడా ఫిక్స్ అయ్యారట టీమ్.
ఈ రామాయణ ప్రాజెక్ట్‌కి సంబంధించి నటించే వారిని ముందుగానే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందులో శ్రీరాముడిగా సూర్య ను ముందుగానే అనుకున్నారు. ఇక తాజా ప్రాజెక్ట్ లో రాముడిగా సూర్యానే తీసుకుని సీతగా ఆలియా భట్, లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్, హనుమంతుడిగా మంచు విష్ణు, రావణాసురుడిగా మోహన్ బాబు, ఇంద్రజిత్‌గా కార్తీ, జటాయుగా సత్యరాజ్ ను నటింపచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ స్టార్ కాస్ట్ చూస్తేనే ఈ ప్రాజెక్ట్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘కన్నప్ప’ కోసం ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి పెద్ద స్టార్లను తీసుకురాగలిగిన విష్ణు, ఆలియా భట్‌ను రామాయణం కోసం సంప్రదించడం పెద్ద సవాలుగా భావించడం లేదు. అయితే, సూర్య హైట్ , స్క్రీన్ ప్రెజెన్స్ విషయాలు ఈ పాత్రకు సరిపోతాయా అన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే రామాయణం సినిమా తెరకెక్కించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో నితేశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా ప్రధాన పాత్రలో రామాయణం సినిమా నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం మొదటి భాగం వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల కానుంది.
గతంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రామాయణం ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు కూడా. ఎన్టీఆర్ రాముడిగా, హృతిక్ రోషన్ రావణాసురిడిగా ఈసినిమా తెరకెక్కించాలని చూశారట. కాని ఆ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆగిపోయియింది. ప్రకటనకే పరిమితం అయ్యింది. వీరితో పాటు పలువురు రామాయణం సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో కూడా రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈమధ్య కాలంలో కూడా ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. అయితే ఈసినిమా భారీ స్థాయిలో వచ్చినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రాముడికి మీసాలేంటి అన్న విమర్శలు కూడా వచ్చాయి. అంతే కాదు ఈసినిమాపై రకరకాల విమర్శలు రావడం, జనాలకు కూడా పెద్దగా నచ్చకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది. ఆదిపురుష్ లో పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
మంచు విష్ణు నిజంగా రామాయణం తెరకెక్కించాలి అనుకుంటే.. ప్రస్తుతం ఉన్న పోటీని తాను తట్టుకోగలడా? మంచు విష్ణు నిజంగా తన సొంత రామాయణ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విష్ణు ఈ కథను తన "డ్రీమ్ ప్రాజెక్ట్"గా పరిగణిస్తున్నాడు. ఇందులో తాను హనుమంతుడిగా నటించాలన్న ఆలోచనలో ఉన్నాడు. అంతేకాక, తన తండ్రి మోహన్ బాబుకు రావణుడి పాత్ర ఇవ్వాలని చూస్తున్నాడు.
స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండడం, కొన్ని కీలక తారాగణాన్ని ఆలోచనలో పెట్టుకోవడం, బడ్జెట్‌కు తగిన నిర్మాణ స్ధాయిని ఏర్పాటు చేయడమే ఇప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్‌కు కీలకం కానుంది. నిజంగా ఈసినిమాపై అధికారికంగా ప్రకటన వెలువడితే, తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ పౌరాణిక చిత్రం ప్రారంభమవబోతుందని చెప్పొచ్చు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయంలో నిజమెంతో చూడాలి.