Kantara Movie Review: `కాంతార` సినిమా తెలుగు రివ్యూ..

First Published | Oct 15, 2022, 3:09 PM IST

కన్నడ సినిమాలు ఇటీవల సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. అలా ఇటీవల కన్నడలో రిలీజై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `కాంతార` సినిమా నేడు (అక్టోబర్‌ 15) తెలుగులో విడుదలైంది. మరి అక్కడి మాదిరిగా ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

`కేజీఎఫ్‌` చిత్రాలతో కన్నడ పరిశ్రమ దేశ వ్యాప్తంగా తన సత్తాని చాటుకుంటుంది. అంతేకాదు ఆ భాష నుంచే వచ్చే సినిమాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. `కేజీఎఫ్‌` తర్వాత వచ్చిన `చార్లీ777`, `విక్రాంత్ రోణా` చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. కన్నడ నుంచి వస్తోన్న కొత్త టాలెంట్‌కి అద్దం పడుతున్నాయి. ప్రజల జీవన విధానం, మనలోని కథలనే కథా వస్తువులుగా మలిచి వాళ్లు సృష్టిస్తున్న అద్భుతాలు అంతా ఇంతా కాదు. మలయాళ చిత్రాల దారిలో ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ కూడా సాగుతుందనే సాంకేతాలనిస్తుంది. తాజాగా వచ్చిన మరో సంచలనం `కాంతార`(అడవి).  
 

దర్శకుడు రిషబ్‌ శెట్టి రూపొందిస్తూ నటించిన చిత్రమిది. దక్షిణ కన్నడలోని అడవిని కథ వస్తువుగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. `కేజీఎఫ్‌` ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇందులో హీరోయిన్‌కి సప్తమి గౌడ నటించగా, కిషోర్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అక్కడ హిట్‌ కావడంతో తెలుగులో గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి నేడు(అక్టోబర్‌ 15)న విడుదల చేశారు. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

Latest Videos


కథః రాజు(1840 కాలం)కి తరని ఆస్తి, సంపద, కుటుంబం, పిల్లలు, రాజ్యం ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక లోటు. అది తెలుసుకునేందుకు రాజ్యం మొత్తం తిరుగుతాడు, స్వాములను, గుళ్లు, గోపురాలను సందర్శిస్తాడు. కానీ తనకు కావాల్సిన మనశ్శాంతి దొరకలేదు. దీంతో వెను తిరిగి వెళ్తున్న సమయంలో ఓ అడవిలోని ఓ శిల వద్ద ఆగిపోతాడు. అది చూడగానే తనలోని చింత మాయమై తెలియని ఆనందం కలుగుతుంది. తనకు ప్రశాంతతని ఇచ్చేది ఇదే అది తెలుసుకున్న ఆయన ఆ శిలని ఇవ్వమని ఆ అడవి ప్రజలను కోరతారు. అందుకు వారి అడవి దేవుడు అరుపు వినపడేంత దూరం తమకి ఇవ్వాలని కోరగా, ఆ అడవి మొత్తాన్ని వారికి ఇచ్చేస్తాడు.
 

కట్‌ చేస్తే 1990లో అడవిలో గ్రామంలో శివ(రిషబ్‌ శెట్టి) అనే యువకుడు ఉంటాడు. ఊరి పోటీల్లో అతనికి తిరుగేలేదు. బాలాదూర్‌ తిరుగుతున్నా ఊరి ప్రజల కోసం నిలబడే వ్యక్తి. అంతలోనే అడవికి ఫారెస్ట్ ఆఫీసర్‌(కిషోర్‌) వస్తాడు. ఊరి జనం మొత్తం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, తిరిగి ఇచ్చేయాలని ఫోర్స్ చేస్తుంటారు. దాన్ని శివ, అతని స్నేహితులు, ప్రజలు అడ్డుకుంటాడు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారికి, శివకి మధ్య గొడవ జరుగుతుంది. అతనిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారు. మరోవైపు ఊరి పెద్ద ప్రభువు అందరితో మంచిగా ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగమవుతూ వారికి పెద్ద దిక్కుగా ఉంటాడు. ఊరి జనం కోసం ఫారెస్ట్ ఆఫీసర్‌ని ఎదురిస్తాడు. అంతలోనే ఊర్లో దైవారాదన చేసే(కోలా ఆడే) శివ సోదరుడు హత్యకు గురవుతాడు. మరి ఆ హత్య చేసిందెవరు? ఊరి పెద్దకి, రాజుకి సంబంధమేంటి? తమ భూమిని కాపాడుకునేందుకు ఊరి ప్రజలు ఏం చేశారు? ఇందులో కోలా దేవుడి కథేంటి అనేది మిగిలిన సినిమా. 

విశ్లేషణః దక్షిణ కన్నడకి చెందిన సాంప్రదాయ అడవి దేవతలు, అక్కడ సంస్కృతిని ఆవిష్కరించే చిత్రమిది. అదే సమయంలో అడవి బిడ్డలను అడవికి దూరం చేసి వారి భూమిని లాక్కునేందుకు భూస్వాములు చేసే కుట్రలు, కుతంత్రాలపై చేసే తిరుగుబాటుని కళ్లకి కట్టిన చిత్రమిది. ఎంత దూరం వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదని చెప్పే చిత్రమిది. అదే సమయంలో మన జీవన విధానంలోని మూలాలను కథా వస్తువులుగా సినిమాలు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన చిత్రం `కాంతార`. ఇది అడవి నేపథ్యంలోనే, అక్కడి కోలా పండుగ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. అడవిలోని పేదల భూములను భూస్వాములు, దొరలు లాక్కోవడమనే కథతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో అడవితో అక్కడ ప్రజలకు ఉన్న అనుబంధంలో ఉండే ఎమోషన్ ఈ సినిమాకి అసలైన ఆత్మ. దాన్ని వదలకుండా దర్శకుడు రిషబ్‌ శెట్టి ఈ సినిమా చాలా బాగా ఆవిష్కరించారు. 
 

సినిమాలో పల్లెటూరి జీవన విధానం, వారి కట్టుబొట్టూ, యాస, చేసే పనులు ఇలా అచ్చుగుద్దినట్టు ఆవిష్కరించారు. ఇందులో భారీ డైలాగులుండవు, హీరో ఓవరాక్షన్‌ ఉండదు, ఆహా.. ఓహో అనే యాక్షన్‌సీన్లు ఉండవు, ప్రతిది చాలా సహజంగా ఉంటుంది. రిషబ్‌ శెట్టి సినిమాలో హీరో అయినా ఎక్కడ ఆయన హీరో అనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలగదు. కేవలం శివ పాత్రనే కనిపిస్తుంది. రిషబ్‌ కూడా ఆ పాత్రలో అంతే బాగా చేసి సినిమాని రక్తికట్టించాడు. జనానికి సందేశం ఇవ్వాలనే దర్శకుడి తపన సినిమాలో ఒక్క చోట కూడా కలగదు. కానీ బోలెడంత సందేశాన్నిస్తుంది. సహజమైన కామెడీ ఆట్టుకుంటుంది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మొదటి భాగం చూసినప్పుడు అక్కడక్కడ కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌ ప్రారంభంలోనూ సినిమా దారెటో అనే సందేహం కలుగుతుంది. కానీ క్లైమాక్స్ మాత్రం నెక్ట్స్ లెవల్‌. కథే విశ్వరూపం చూపించిన ఫీలింగ్‌ ఆడియెన్స్ కి కలుగుతుంది. అదే ఫీలింగ్‌తో బయటకు వస్తారు. 

ఈ సినిమా ఇప్పటికే కన్నడలో రెండు వారాల క్రితం విడుదలై అక్కడ సంచలన విజయం సాధించింది. నేడు తెలుగులో రిలీజ్‌ అయిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. నెటివిటీ ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టినా బాగా ప్రమోట్‌ చేస్తే బీ, సీ సెంటర్లలో బాగా ఆడుతుందని చెప్పొచ్చు.

ఆర్టిస్టుల ప్రదర్శనః 

శివ పాత్రలో రిషబ్‌ శెట్టి అద్భుతంగా చేశాడు. ఇటు పాత్రకి ప్రాణం పోశాడు, అటు అడవికి ప్రాణం పోశాడు. ఆయన ప్రియురాలిగా లీలా పాత్రలో సప్తమి గౌడ బాగా చేసింది. పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. ఊరిపెద్దగా అచ్యుత్‌ కుమార్‌, ఫారెస్ట్ ఆఫీసర్‌గా కిషోర్‌ కుమార్‌ ఇరగదీశారు. రిషబ్‌ శెట్టి ఫ్రెండ్స్ గా చేసిన ఆర్టిస్టుల కామెడీ నవ్వులు పూయించారు.ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్ల కామెడీ బాగా నవ్విస్తుంది. మిగిలిన పాత్రలు కూడా బాగా చేశారు. ఏ ఒక్కరు అనవసరం అనే ఫీలింగ్ కలగదు. 

టెక్నీషియన్ల ప్రతిభః
సినిమాకి కథే హీరో. రిషబ్‌ శెట్టి అద్భుతంగా ఆవిష్కరించారు. టైట్‌ స్క్రీన్‌ప్లే తో `కాంతార`ని తెరకెక్కించారు. సహజత్వాన్ని ఒడిసిపట్టి, దాన్ని ఎమోషన్‌ మిస్‌ కాకుండా వెండితెరపై ఆవిష్కరించిన తీరుకి శెభాష్‌ అనాల్సిందే. దర్శకుడిగా, నటుడిగా ఆయన అదరగొట్టారని చెప్పొచ్చు. సినిమాకి విజువల్స్, సంగీతం, బీజీఎం పెద్ద అసెట్‌. అవి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అరవింద్‌ కశ్యప్‌ విజువల్‌ అబ్బురపరుస్తుంటాయి. విజువల్స్ కనువిందుగా ఉంటాయి. మరోవైపు బీజీఎం, పాటలతో లోకనాథ్‌ అజనీష్‌ అదరగొట్టారు. ముఖ్యంగా `వారాహ.. `అంటూ పాట, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా స్థాయిని పెంచాయి. ఎడిటింగ్‌ వర్క్ బాగుంది. ఇంకాస్త ఫోకస్‌ పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన చిత్రం కావడంతో ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కి వంక పెట్టడానికి లేదు. సినిమాకి వాడిన కలరింగ్‌, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ సూపర్బ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. 

ఫైనల్‌ గాః సినిమాకి కన్నడ నెటివిటీ కొంత ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు, కానీ సినిమా చూశాక ఎమోషన్‌కి నెటివిటితో పనిలేదనే ఫీలింగ్‌ ఆడియెన్స్ లో కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

రేటింగ్‌ః 3
 

click me!