Banaras Review: బనారస్‌ సినిమా తెలుగు రివ్యూ

First Published | Nov 4, 2022, 7:15 AM IST

టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్ తో రూపొందిన కన్నడ చిత్రం `బనారస్‌` నేడు(శుక్రవారం) పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కన్నడ చిత్రాలు ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తాచాటుతున్నాయి. `కేజీఎఫ్‌` తర్వాత కన్నడ చిత్రాల రేంజే మారిపోయింది. ఇటీవల వచ్చిన `విక్రాంత్‌ రోణా`, `కాంతార` మంచి విజయాలు సాధించడంతో అక్కడి నుంచే వచ్చే సినిమాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా `బనారస్‌` అనే కొత్త సినిమా అదే పేరుతో తెలుగులో  విడుదలవుతుంది. కర్నాటక రాజకీయ నేత జమీర్‌ అమ్మద్‌ కుమారుడు జైద్‌ ఖాన్‌ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది. `బెల్‌ బాటమ్‌` చిత్రంతో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయతీర్థ ఈ చిత్రాన్ని రూపొందించారు. సోనాల్‌ మాంటెరో హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం(నవంబర్‌ 4)న ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. Banaras Review

కథః 
బనారస్‌(వారణాసి) నేపథ్యంలో సాగే చిత్రమిది. సిద్ధార్థ్‌ తన ఫ్రెండ్స్ తో సింగర్‌ ధని(సోనాల్‌ మెంటెరియో)ని ప్రేమలో పడేస్తానని బెట్‌ కడతాడు. ఓ జాతరలో ఆమెని కలుసుకుని తానొక ఆస్ట్రోనాట్, టైమ్‌ ట్రావెలర్‌ని, తాను ఫ్యూచర్‌ నుంచి పాస్ట్ కి వచ్చానని చెబుతాడు. అంతేకాదు నువ్వు తనకు కాబోయే భార్యవి అని అందుకే నిన్ను కలిశానని చెబుతాడు. ఈ క్రమంలో టైమ్‌ ట్రావెలర్ కి సంబంధించిన కొంత థియరీని ఎక్స్ ప్లెయిన్ చేస్తాడు. దీంతో ధని అతన్ని నమ్మేస్తుంది. తన రూమ్‌కి కూడా తీసుకెళ్తుంది. రాత్రి బెడ్‌పై ఆమెతో ఫోటో తీసుకుని ఫ్రెండ్స్ తో కాసిన బెట్‌ని గెలుస్తాడు సిద్ధార్థ్‌. అనంతరం వాళ్లు విదేశాలకు ఎంజాయ్‌ చేయడానికి వెళ్తారు. ధనితో రాత్రి సమయంలో బెడ్‌పై దిగిన సెల్ఫీని సిద్ధార్థ్‌ ఫ్రెండ్‌ అనుకోకుండా ఇతరులకు షేర్‌ చేయడంతో అది సోషల్‌ మీడియాలో మొత్తం వైరల్‌ అవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మానాన్న లేని ధని బనారస్‌లో ఉండే తన బాబాయ్‌ పిన్ని వాళ్ల ఇంటికి వచ్చేస్తుంది. తన వల్ల అమ్మాయి జీవితం నాశనం అయ్యిందని గిల్టీ ఫీలింగ్‌తో బాధపడిన సిద్ధార్థ్‌ తన తప్పుని చెప్పి, క్షమాపణ కోరదామని బనారస్‌ వస్తాడు. సిద్ధార్థ్ ని ధని క్షమించిందా? ఆయన ప్రేమలో ఎలా పడింది? సిద్ధార్థ్‌ జీవితంలో టైమ్‌ ట్రావెల్‌ కథేంటి, చివరికి ఈ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా. Banaras Review

Latest Videos


విశ్లేషణః 
ట్రైమ్‌ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఇండియాలో, సౌత్‌లోనూ అడపాదడపా చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల `ఒకే ఒక జీవితం` అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చింది. తాజాగా `బనారస్‌` తెరకెక్కింది. అయితే ఇదొక విభిన్నమైన టైమ్‌ ట్రావెలింగ్‌ స్టోరీ. ఓ ప్రయోగాత్మక చిత్రమని చెప్పొచ్చు. ప్రేమ, ఎమోషన్స్, మ్యూజిక్‌, టైమ్‌ ట్రావెలింగ్‌ అనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలతో, కొంత లవ్‌ ట్రాక్‌తో సాగుతుంది. తన తప్పుని ఒప్పుకుని క్షమాపణ కోరడంలోనే మానసిక ప్రశాంతత ఉంటుందని, తప్పుని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలనే తండ్రి చెప్పే ఫిలాసఫీతో సిద్ధార్థ్‌ వారణాసి ప్రయాణం చేయడం, ఆమెని వెతికే క్రమంలో శంభు(సుజయ్‌ శాస్త్రి)తో సిద్ధార్థ్‌ జర్నీ ఆద్యంతం సరదాగా సాగుతుంది. ముఖ్యంగా శంభు పాత్ర వారణాసిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. అదే ఎంటర్‌టైనింగ్‌ రోల్. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, హీరోయిన్‌కి సారీ చెప్పేందుకు వీరు పడే పాట్లు సరదాగా ఉంటాయి. ఆకట్టుకుంటాయి. Banaras Review

ఫస్టాఫ్ కాస్త లెంన్తీగా అనిపిస్తుంది. కానీ వారణాసిలో హీరోయిన్‌ పాడే అమ్మ పాట ఎమోషన్‌గా ఉంటుంది. హృదయాలను హత్తుకుంటుంది. బోర్‌ ఫీలింగ్ నుంచి కాస్త రిలీఫ్‌నిస్తుంది. ఇక సెకండాఫ్‌లో సినిమా మొత్తం టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్ తోనే సాగుతుంది. దీంతో మొదటి భాగానికి, సెకండాఫ్‌ సంబంధం లేని విధంగా అనిపిస్తుంది. ఒకే సంఘటనని టైమ్‌ ట్రావెలింగ్‌ లూప్‌లో మూడుసార్లు చూపించడం ఇక్కడ ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ధనిని, ఆమె బాబాయ్‌, పిన్నిలు హత్యకి గురవుతారు. ఆ విషయం థియేటర్లో సినిమా చూస్తున్న సిద్ధార్థ్‌ కి కళగా వస్తుంది. మొదట పెద్దగా నమ్మని సిద్ధార్థ్‌ కల వచ్చినట్టుగానే బయట సంఘటనలు జరుగుతుండటంతో ఇది నిజమే అని భావించి వారిని కాపాడేందుకు వెళ్తాడు, కానీ అప్పటికే వాళ్లు చనిపోయి ఉంటారు. మళ్లీ అది థియేటర్లో కన్న కలగానే అనిపిస్తుంది. మళ్లీ అతను వారిని కాపేందుకు పరిగెడతాడు. మూడోసారి వారిని సేవ్ చేస్తాడు. కానీ అది కూడా టైమ్‌ ట్రావెలింగ్‌లోని లూపే అని మరోసారి భ్రమ పొందడం, ఇదంతా తాము ధని విషయంలో సిద్ధార్థ్‌ చేసిన దానికి కక్ష్యా సాధించే చర్యగా వివరిస్తాడు ఆమె బాబాయ్‌. తను సైంటిస్ట్. అదంతా భ్రమే అని, నిజం కాదని చెప్పడంతో అంతా రిలీఫ్‌ అవుతారు.
 

అయితే సెకండాఫ్‌ టైమ్‌ ట్రావెలింగ్‌ సంబంధించిన సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. అదే సమయంలో విసుగుతెప్పిస్తాయి. ఒకే సంఘటన మూడు సార్లు రిపీట్ కావడం కొత్తగా, ఓపికని పరీక్షించేదిగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. హత్య చేసే సన్నివేశాల వరకు బాగానే అనిపించినా, ఆ తర్వాత క్లైమాక్స్ మాత్రం తేలిపోయింది. కన్విన్సింగ్‌గా అనిపించదు. అంతసేపు హడావుడి చేసి చివర్లో తేలేశారు. సరైన కన్‌క్లూజన్‌ అనిపించక తేలిపోయినట్టుగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక అలా వదిలేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ డెత్‌ ఫోటోగ్రాఫర్‌గా చేసే సుజయ్‌ శాస్త్రి చివర్లో హీరోహీరోయిన్లని ఫోటో తీసే సీన్‌ హృదయాన్ని హత్తుకుంటుంది. సినిమాలో సంగీతం ప్రధానంగా సాగే లవ్‌ మ్యూజికల్‌ జర్నీ బాగుంది. కానీ టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్టే ఇంకా క్లారిటీగా, బెటర్‌గా చేస్తే సినిమా ఫలితం బాగుండేది. అమ్మానాన్నల సెంటిమెంట్ సినిమాకి ప్రధాన బలం. 
 

నటీనటుల ప్రదర్శనః 
ఏ హీరో అయిన తొలి సినిమా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నిగానీ, సరికొత్తలవ్‌ స్టోరీగానీ ఎంచుకుంటారు. కానీ జైద్‌ ఖాన్‌ అందుకు భిన్నంగా ఓ ప్రయోగాత్మక చిత్రం ఎంచుకోవడం అతని స్పెషాలిటీని తెలియజేస్తుంది. తొలి చిత్రమే అయినా కన్విన్సింగ్‌గా చేశాడు. లవర్‌ బాయ్‌ లుక్‌ బాగుంది. అతను సినిమాలో బ్రిలియంట్‌గా కనిపించినా, ఫేస్‌లో మాత్రం ఇన్నోసెన్సీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ధని పాత్రలో సోనాల్ మంటెరో చాలా బాగా చేసింది. ఇన్నోసెంట్‌గా ఉంటూనే ఎమోషన్స్ బాగా పలికించింది. రొమాంటిక్‌ సాంగ్‌లో ఆమె అందాలు నెక్ట్స్ లెవల్. శంభు పాత్రలో సుజయ్‌శాస్త్రి సినిమాకి హైలైట్. ఉన్నంతలో అతనే నవ్వించాడు, కన్నీళ్లు పెట్టిస్తాడు. హీరోయిన్‌ బాబాయ్‌గా అచ్యుత్‌ కుమార్‌, హీరోతండ్రిగా దేవరాజ్‌, పీటర్‌గా బర్కత్‌ అలీ, హీరోయిన్ పిన్నిగా స్వప్నాదత్‌ ల నటన ఆకట్టుకుంటుంది.  Banaras Review

టెక్నీషియన్లుః
టెక్నికల్‌గా సినిమా అదిరిపోయిందనే చెప్పాలి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సినిమాకి బ్యాక్‌ బోన్‌. బీజీఎం, మ్యూజిక్‌ అదిరిపోయింది. రెండు పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. అద్వైత్‌ గురుమూర్తి కెమెరా వర్క్ సినిమాకు మరో బలం. ఆయన ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించారు. వారణాసిని మరో లెవల్‌లో చూపించాడు. ఎడిటింగ్‌ లోపాలున్నాయి. ఎడిటర్‌ కూడా కన్‌ఫ్యూజ్‌ అయ్యాడని అర్థమవుతుంది. నిర్మాణ విలువల విషయంలో ఎన్‌కే ప్రొడక్షన్స్ రాజీపడకుండా నిర్మించారు. సినిమా పట్ల చాలా కేర్‌ తెరపై కనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాకి మరో అసెట్‌, అదే సమయంలో సెకండాఫ్‌లో ఆయన టేకింగ్‌ మైనస్‌గా నిలిచింది. లాజికల్‌గా సినిమాని నడిపించిన విధానం బాగుంది, కానీ చాలా చోట్ల ఆయనే లాజిక్‌ మిస్ అయ్యాడు. ముఖ్యంగా టైమ్‌ ట్రావెలింగ్‌ కాన్సెప్ట్ చాలా క్లిష్టమైనది. అంత ఈజీగా కన్విన్స్ చేయడం సాధ్యం కాదు, ఆ విషయంలో దర్శకుడు పడ్డ శ్రమ కనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో ఇంకాస్త క్లారిటీ మెయింటేన్‌ చేయాల్సింది. చివర్లో ఏదైన సర్‌ప్రైజింగ్‌ విషయం పెడితే సినిమా ఫలితం నెక్ట్స్ లెవల్‌ లో ఉండేది. Banaras Review

ఫైనల్‌గాః టైమ్‌ ట్రావెలింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో కాస్త ఎమోషన్స్ మేళవించిన మ్యూజికల్‌ లవ్‌ జర్నీ. ప్రయోగాలు ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుంది. 

రేటింగ్‌ః 3
 

click me!