
భారత కీపర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సాధించాడు. లీడ్స్ లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్ తో భారత్ మొదటి టెస్టు ఆడుతోంది. ఈ మ్యాచ్ లో భారత ఆటగాడు రిషబ్ పంత్ చారిత్రాత్మక ఘనత సాధించాడు.
టెస్టు వైస్-కెప్టెన్‌గా ఉన్న పంత్.. నాల్గవ రోజు తన బ్యాటింగ్ ప్రతిభను మరోసారి చాటుతూ, రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.
రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 134 పరుగులు సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నాక్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఇదే మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 118 పరుగుల సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జోష్ టంగ్ పంత్ వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనిని షోయబ్ బషీర్ అవుట్ చేశాడు.
రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలతో అరుదైన ఫీట్ సాధించిన ఏడవ భారత ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ లిస్టులో విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ (మూడు సార్లు), రాహుల్ ద్రావిడ్ (రెండు సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మలు ఉన్నారు.
ఇంగ్లాండ్ లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, అతను టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్. పంత్ ముందు ఈ ఘనత జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఆండీ ఫ్లవర్ 2001లో సాధించాడు.
ఇంగ్లాండ్ గడ్డపై నాలుగు టెస్టు సెంచరీలతో రిషభ్ పంత్.. సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ 6 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. పంత్ ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన ఆరు అర్ధ సెంచరీలలో నాలింటిని సెంచరీలుగా మార్చడంలోను ప్రత్యేకంగా నిలిచాడు.
మ్యాచ్ నాల్గవ రోజు ఉదయం కెప్టెన్ శుభ్ మన్ గిల్ వికెట్ ను భారత్ త్వరగానే కోల్పోయింది. గిల్ ఔట్ అయిన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి భారత్ స్కోరు 92/3 పరుగులుగా ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి అతను మెల్లగా ఆటను ముందుకు నడిపించాడు.
లంచ్ తర్వాత పంత్ మెరుపులు మెరిపించాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను టార్గెట్ చేసి పరుగులు రాబట్టాడు. 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ అదరగొట్టాడు. అయితే తర్వాత బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి సెంచరీలతో భారత్ 300+ పరుగులు మార్కును దాటింది.
రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సులతో ఆకట్టుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ టెస్టు మ్యాచులో ఓ విదేశీ బ్యాటర్ చేసిన అత్యధిక సిక్సులు. గతంతో సామ్ లోక్స్టన్ (1948), మైకేల్ హోల్డింగ్ (1984), అడమ్ గిల్‌క్రిస్టు (2001) ఐదేసి సిక్సర్లలో ఉన్నారు. ఇప్పుడు పంత్ వారి రికార్డులు బ్రేక్ చేశాడు.
ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో భారత వికెట్ కీపర్లలో పంత్ అత్యధిక సెంచరీలు సాధించాడు. మొత్తం 8 సెంచరీలు కొట్టాడు. ఎంఎస్ ధోని (6 సెంచరీలు) రికార్డును దాటేశాడు. టెస్టు క్రికెట్‌లో 44 మ్యాచ్‌లలో పంత్ 3,200 పరుగులు సాధించగా, సగటు 44.44గా ఉంది. ఇంగ్లాండ్ పై పంత్ 1,033 పరుగులు చేశాడు.
రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన అనంతరం కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ అతని చలాకీ ఆటపై ఆనందం వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత చేసిన ఫ్రంట్ ఫ్లిప్‌ను మళ్లీ చేయాలని సంకేతాలిచ్చారు. కానీ పంత్ మాత్రం "ఫింగర్ ఐ" సెలబ్రేషన్ చేసి ప్రేక్షకులను అలరించాడు. పంత్ 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 137 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.