
KL Rahul hits ninth Test century : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాల్గవ రోజు కేఎల్ రాహుల్ తన 9వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. భారత జట్టుకు బలమైన పునాది వేశాడు. ఇది రాహుల్‌కు సుమారు 18 నెలల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం విశేషం.
భారత జట్టు నాల్గవ రోజు ఉదయం శుభ్ మన్ గిల్ వికెట్ ను త్వరగా కోల్పోయింది. కేల్ రాహుల్ - రిషభ్ పంత్ జోడి సమయోచితంగా ఆడి జట్టును నిలబెట్టింది. రాహుల్ తన సెంచరీని 202 బంతుల్లో 13 బౌండరీలతో పూర్తి చేశాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ షోయబ్ బషీర్ వేసిన 62వ ఓవర్‌లో వచ్చింది. కేఎల్ రాహుల్ కు ఇది మూడో ఇంగ్లాండ్ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. భారత ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కు ఇది ఎనిమిదవ సెంచరీ.
మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ మంచి టచ్ లో కనిపించాడు. అయితే, 42 పరుగుల వద్ద అవుటయ్యాడు. బ్రైడన్ కార్స్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి, కీపర్‌కు క్యాచ్ గా దొరికిపోయాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో అతను మరింత పట్టుదలతో ఆడి ఈసారి తన అవకాశాన్ని వృథా చేయలేదు. సెంచరీతో కదం తొక్కాడు.
భారత్ జట్టు నాల్గవ రోజు ఆట ప్రారంభించిన 7 బంతులకే కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది. బ్రైడన్ కార్స్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని గిల్ స్టంప్స్‌కి ఆడడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది.
అయితే వెంటనే వచ్చిన రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌కు తోడుగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదర్కొన్నాడు. వారి మధ్య ముప్పై ఓవర్లకు పైగా భాగస్వామ్యం కొనసాగింది. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. 118 పరుగులు సెంచరీ ఇన్నింగ్స్ లో పంత్ 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ తర్వాత క్రికెట్ దిగ్గజాల నుంచి కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, “రాహుల్ అసాధారణ ఆటగాడు. తన సామర్థ్యాన్ని పూర్తిగా బయటకు తీయలేదు. శాంతమైన వూహాశక్తితో ఆడుతున్నాడు” అని పేర్కొన్నారు.
నాసర్ హుస్సేన్ రాహుల్ సెంచరీపై స్పందిస్తూ, “అత్యుత్తమ స్థాయి ఆటగాడు ఇచ్చిన అద్భుత ప్రదర్శన. తప్పకుండా గొప్ప గౌరవం లభించిన క్షణం ఇది” అని చెప్పారు. మైకల్ అథర్టన్ రాహుల్ శతకాన్ని "అద్భుత కవర్ డ్రైవ్‌తో" వచ్చిందని కొనియాడారు.
రాహుల్ సెంచరీ పూర్తయినప్పుడు కెప్టెన్ శుభ్ మన్ గిల్ నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇది ఇద్దరి మధ్య పరస్పర గౌరవానికి నిదర్శనం.
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ లంచ్ సమయానికి మూడు వికెట్లకు 153 పరుగులు చేసింది. అప్పటికి భారత్ 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. లీడ్స్ పిచ్ అధికంగా క్షీణించకపోవడంతో, భారత్ 400 పరుగులకుపైగా లక్ష్యం ఇవ్వాలని చూస్తోంది. కేఎల్ రాహుల్, పంత్ సెంచరీలతో ప్రస్తుతం భారత్ 303 పరుగులు ఆధిక్యంతో ఆటను కొనసాగిస్తోంది.
రోహిత్ శర్మ గాయంతో టెస్టుల నుంచి తప్పుకోవడం, ఆసీస్‌తో పెర్త్ టెస్టులో రాహుల్ కు ఓపెనింగ్ చేయడానికి అవకాశం దొరికింది. మెల్బోర్న్ టెస్టులో రోహిత్ తిరిగి వచ్చినప్పటికీ, అతని రిటైర్మెంట్ తర్వాత రాహుల్ మరోసారి ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.
ప్రస్తుతం భారత్ 298/4 (74.1 ఓవర్లు) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో కేఎల్ రాహుల్ 120 పరుగులు, కరుణ్ నాయర్ 4 పరుగులతో ఆడుతున్నారు.