RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి అభిమానులకు మరపురాని విజయాన్ని అందించింది. దీంతో వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతడు కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది. చివరివరకు క్రీజులో నిలిచిన కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
24
19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరుదైన జాబితాలో చోటు
ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇప్పటివరకు సురేశ్ రైనా, డేవిడ్ వార్నర్, వెంకటేష్ అయ్యర్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సరసన నిలిచాడు. ఫైనల్ లో ఒత్తిడిని అధిగమించి ఈ ఘనత సాధించడం కోహ్లీ స్థాయిని మరోసారి చాటిచెప్పింది.
34
వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ కీలక సహకారం
కోహ్లీకి మరో ఎండ్‌లో వెంకటేష్ అయ్యర్, టిమ్ డేవిడ్ చక్కటి మద్ధతు అందించారు. వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు మలిచాడు. అనంతరం టిమ్ డేవిడ్ 24 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కూడా తమ వంతు పరుగులు జోడించడంతో బెంగళూరు లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. 37 బంతుల్లో అజేయ అర్ధశతకం నమోదు చేసి జట్టును 155 పరుగుల వరకు తీసుకెళ్లాడు. అయితే ఆ స్కోర్‌ను కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలింగ్ విభాగంలో రసిఖ్ సలామ్ మూడు వికెట్లు సాధించగా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసి గుజరాత్‌ను పెద్ద స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఫైనల్‌లో ఆర్‌సీబీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మరోసారి ఐపీఎల్ కప్‌ను ఎగరేసుకుపోయింది.