Mohammed Shami : ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడం పై టీమిండియా స్టార్ పేసర్ మమ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “నేను రంజీ ఆడగలిగితే వన్డేలు ఎందుకు ఆడలేను” అంటూ బీసీసీఐ తీరుపై హాట్ కామెంట్స్ చేశాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం జట్టులో చోటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై చర్చలు జరుగుతుండగా, షమీని తప్పించడంపై మొదట పెద్దగా చర్చ రాలేదు. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా స్పందిస్తూ బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
26
ఫిట్నెస్ ఇష్యూ ఉంటే నేను రంజీ ఎందుకు ఆడతాను? : షమీ
ఈడెన్ గార్డెన్స్‌లో రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన షమీ.. “నేను ఎన్నోసార్లు చెప్పాను, సెలక్షన్ నా చేతుల్లో ఉండదు. ఫిట్నెస్ సమస్య ఉంటే నేను ఇక్కడ బెంగాల్ కోసం రంజీ ట్రోఫీ ఆడలేని పరిస్థితి ఉంటుంది. నేను నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగితే, 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలను” అని అన్నారు.
ఆయన వ్యాఖ్యలు స్పష్టంగా బీసీసీఐ నిర్ణయంపై అసహనాన్ని సూచిస్తున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో “షమీ ఫిట్నెస్‌పై ఎటువంటి తాజా సమాచారం లభించలేదని” చెప్పారు. దీనికి షమీ సమాధానంగా తన ఫిట్నెస్‌ను రంజీ ట్రోఫీలో పాల్గొనడంతో నిరూపిస్తున్నానని తెలిపారు.
36
ఫిట్నెస్ అప్‌డేట్ ఇవ్వడం పై బీసీసీఐకి బాధ్యత లేదా?
అలాగే, షమీ తన ఫిట్ నెస్ అప్డేట్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎవరికి ఫిట్నెస్ అప్‌డేట్ ఇవ్వాలి, ఎవరు అడగాలి అన్నది నా బాధ్యత కాదు. నా పని నేషనల్ క్రికెట్ అకాడమీ వెళ్లి ప్రాక్టీస్ చేయడం, మ్యాచ్‌లు ఆడడం. ఎవరు ఎవరికి అప్‌డేట్ ఇస్తారు అనేది నా పని కాదు” అని మరోసారి అన్నారు.
2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో షమీ అదరగొట్టాడు. రికార్డు స్థాయిలో వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత గొంతు, కాలి గాయాల కారణంగా సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక కాలేదు.
షమీ చివరిసారి మార్చ్ 2025లో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడారు. ఆ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తితో కలిసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఆసియా కప్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లలో ఆయనకు అవకాశం ఇవ్వలేదు.
56
జట్టులోకి ఎంపిక అనేది మీ నిర్ణయం, నేను మ్యాచ్‌లు ఆడుతూనే ఉంటాను : షమీ
సీనియర్ బౌలర్‌గా తన బాధ్యతను వివరించిన షమీ.. “సెలక్షన్ నా చేతుల్లో లేదు. నేను చేయగలిగేది ప్రాక్టీస్ చేసి, మ్యాచ్‌లు ఆడడం మాత్రమే. మీరు నన్ను ఎంపిక చేయకపోతే నేను బెంగాల్ కోసం ఆడతాను, నాకు దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు” అని తెలిపాడు.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని ఆయన అన్నారు. “దేశం కోసం ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలి. గెలుపు దేశానికే చెందాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
66
షమీ ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నాడు: బెంగాల్ కోచ్
బెంగాల్ జట్టు కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా షమీ ఫిట్నెస్‌పై స్పందించారు. అతను ఇప్పుడు మరిత ఫిట్ గా ఉన్నారని తెలిపాడు. “గత సంవత్సరం శస్త్రచికిత్స తర్వాత కొంత ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు, సాఫీగా పరుగెత్తుతున్నారు. గత ఏడాదికంటే ఈసారి మరింత ఫిట్‌గా ఉన్నారు” అని రతన్ శుక్లా తిలపారు.
అయితే, భారత జట్టులో స్థానం దక్కకపోవడం పట్ల షమీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నాననీ, ఆడగలననీ తెలిపాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయం పై అంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. భారత జట్టుకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన ఈ సీనియర్ బౌలర్ తన ఫిట్నెస్, పట్టుదలతో మరోసారి రీ-ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు. అయితే, ప్రస్తుతం యంగ్ బౌలర్లతో పోటీ పడుతూ మళ్లీ భారత జట్టులోకి తిరిగి రావడం అంత ఈజీ కాదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే షమీ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డు పడే అవకాశాలున్నాయి.