Jasprit Bumrah: వసీం అక్రమ్‌ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

Published : Jun 22, 2025, 04:51 PM IST

Jasprit Bumrah: సెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియాన్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా వసీం అక్రమ్‌ రికార్డును బ్రేక్ చేశాడు. లీడ్స్ టెస్ట్‌లో అద్భుతమైన బౌలింగ్ తో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టులోని కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు.

PREV
15
బుమ్రా చరిత్ర సృష్టించాడు

ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చారిత్రక ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మైలురాయిని బుమ్రా ఇంగ్లాండ్‌పై తొలి టెస్టులో సాధించాడు. జాక్ క్రాలీ వికెట్ తీయడంతో ఈ ఘనత అందుకున్నాడు. బెన్ డకెట్, ఓల్లి పోప్ ల మధ్య వంద పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసి డకెట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే వికెట్‌తో బుమ్రా 147వ వికెట్‌ను సాధించి వసీంను దాటాడు.

సెనా దేశాల్లో బుమ్రా రికార్డులు

జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు సెనా దేశాల్లో 32 టెస్టుల్లో 147 వికెట్లు పడగొట్టాడు. ఆయా వికెట్ల సగటు 21.03 కాగా, ఉత్తమ గణాంకాలు 6/33. ఈ దేశాల్లో తొమ్మిది సార్లు ఐదు వికెట్లు తీశాడు.

దీనితో పోల్చితే వసీం అక్రమ్ 32 టెస్టుల్లో 146 వికెట్లు తీసాడు. ఆయన సగటు 24.11, బెస్ట్ ఫిగర్స్ 7/119 వికెట్లు. వసీం 11 సార్లు ఐదు వికెట్లు, మూడుసార్లు 10 వికెట్లు తీసాడు.

25
ఆస్ట్రేలియాలో బుమ్రా ప్రభావం

బుమ్రా అత్యధికంగా విజయవంతం అయిన సెనా దేశం ఆస్ట్రేలియా. ఇక్కడ 12 టెస్టుల్లో 64 వికెట్లు తీసుకున్నాడు. అతని సగటు: 17.15 కాగా, బెస్ట్ బౌలింగ్ 6/33 వికెట్లు. నాలుగు సార్లు వికెట్లు సాధించాడు. చివరి ఆస్ట్రేలియా టూర్‌లో మొత్తం 32 వికెట్లు తీసుకున్న తర్వాత బుమ్రా ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాడు.

ఇంగ్లాండ్‌లో బుమ్రా 10 టెస్టుల్లో 39 వికెట్లు తీశాడు. సగటు 26.02 కాగా, ఉత్తమ బౌలింగ్ గణాంకాలు 5/64గా ఉంది. ఇక్కడ రెండు సార్లు 5 వికెట్లు సాధించాడు.

35
బుమ్రా పై మంజ్రేకర్ ప్రశంసలు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్.. రెండో రోజు బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బుమ్రా మంచి బౌలింగ్ తో ఆకట్టుకోగా.. మిగతా బౌలర్లు రాణించలేదు. ఈ మ్యాచ్ లో బుమ్రా ఇప్పటివరకు మూడు వికెట్లు పడగొట్టాడు. 

బుమ్రా మరోసారి వికెట్లు సాధించే నైపుణ్యం చూపాడని మాజీ క్రికెటర్, విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. “ఈ పిచ్‌పై నలుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించగా, నిజమైన మ్యాజిక్ బౌలింగ్ బుమ్రా నుంచే వచ్చింది” అని ఆయన అన్నారు.

మంజ్రేకర్ బుమ్రాను లెజెండరీ న్యూజిలాండ్ బౌలర్ సర్ రిచర్డ్ హాడ్లీతో పోల్చాడు. “బుమ్రా ఫీల్డ్‌లో అడుగుపెట్టగానే వికెట్ తీస్తాడని భావన కలుగుతుంది. ఇదే గుణం హాడ్లీకి కూడా ఉండేది. ఈ స్థాయి మాస్టర్ ప్రదర్శనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి” అని అన్నారు.

45
ఓవర్ ఆఫ్ ది డే: బుమ్రా vs బ్రూక్

డే 2 చివరి ఓవర్‌లో హ్యారీ బ్రూక్‌కు ఎదురైన బుమ్రా స్పెల్ గురించి మంజ్రేకర్ ప్రత్యేకంగా వివరించాడు. “బుమ్రా అతనికి తన ఇన్నింగ్స్ లో చూపించని షార్ట్ బాల్‌తో బ్రూక్‌ను దెబ్బకొట్టాడు. బౌలింగ్ సెటప్ అంతా ఒక కళ. అద్భుత ప్రణాళికతో బ్రూక్‌ను బౌన్సర్‌తో అడ్డుకోవడం బుమ్రా మేధస్సుకు నిదర్శనం” అని వివరించాడు.

భారత జట్టు టాపార్డర్ సూపర్ బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ (101 పరుగులు), శుభ్‌మన్ గిల్ (147 పరుగులు), రిషభ్ పంత్ (134 పరుగులు) అద్భుత సెంచరీలతో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తరపున కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/66), జోష్ టంగ్ (4/86) మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు.

గిల్-పంత్‌ల 209 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా మంజ్రేకర్ ప్రశంసించాడు. “ఇద్దరూ నమ్మకంగా, సునాయాసంగా పరుగులు సాధించారు. పంత్ ఆట కాస్త వేరుగా ఉన్నా, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ భవిష్యత్‌కు ఆసక్తికరమైన సూచన” అని అన్నారు.

55
పోప్ ఇన్నింగ్స్‌పై అభినందనలు

ఇంగ్లాండ్ ప్లేయర్ ఓల్లి పోప్ సెంచరీపై మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. “బుమ్రా లాంటి బౌలింగ్ దళానికి వ్యతిరేకంగా సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు. ఇది పోప్‌కు గర్వకారణంగా ఉంటుంది” అని అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో పోప్ 106 పరుగులు, బెన్ డకెట్ 62 పరుగులు చేశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 62.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో బ్రూక్ 35 పరుగులు, బెన్ స్టోక్స్ 18 పరుగులతో ఆడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories