
భారత టెస్టు క్రికెట్ మీద ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. దీనికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మూల కేంద్రమయ్యారు. న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు ఓటమి పాలు కావడం, ఆ సిరీస్‌ను భారత్ కోల్పోవడం పెద్ద వివాదంగా మారలేదు. కానీ దక్షిణాఫ్రికాపై రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ కోల్పోవడంతో గంభీర్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఓటమికి కెప్టెన్‌నో, జట్టునో నిందించకుండా హెడ్ కోచ్‌ను నిందించడం విచిత్రమే అయినప్పటికీ సంభవిస్తున్న పరిణామాలు అందుకు కారణమవుతున్నాయి. జట్టు కూర్పు నుంచి మొదలు పెడితే మైదానంలోకి దిగే 11 మంది సభ్యుల ఎంపికపై కూడా ఆయననే తప్పు పడుతున్నారు.
ఒకప్పుడు భారత్‌లో మన జట్టును ఓడిరచడం సులభం కాదని విదేశీ క్రికెట్ జట్లు భావించేవి. కానీ, ఇప్పుడు అత్యంత సులభమనే అభిప్రాయానికి వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణంగా గౌతమ్ గంభీర్‌ను, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను చూపుతున్నారు. సీనియర్ క్రికెటర్లలో సునీల్ గవాస్కర్ తప్ప గంభీర్‌కు సపోర్ట్ నిలిచేవారెవరూ లేరు. మైదానంలో క్రికెటర్లు సరిగా ఆడకపోతే కోచ్ ఏం చేస్తాడని ఆయన అన్నారు. కానీ తప్పంతా గంభీర్ వ్యవహార శైలిలో ఉందనే విషయాన్ని ఆయన కావాలనే మరుగుపరుస్తున్నారని అనుకోవచ్చు. అయితే, ఆయన మరో మాట కూడా అన్నారు. క్రీజులో కొద్దిసేపు కూడా నిలబడలేని బ్యాటర్స్ ఉన్నారని, దీన్ని గంభీర్ ఫిక్స్ చేయాలని ఆయన అభిప్రాయంగా ఉంది. జట్టు కూర్పు విషయంలోనే గంభీర్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావు ఇస్తుందనే విషయాన్ని ఆయన దాచి పెట్టారు.
రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని కొనసాగించి వుంటే ఫలితం మరో విధంగా ఉండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అయితే, రిటైర్‌మెంట్ ప్రకటించే స్థితికి వారిద్దరినీ గంభీర్ నెట్టారనే విమర్శలో తప్పేమీ కాదు. వారిద్దరినీ పక్కకు తప్పించాలని అనుకున్నప్పుడు గంభీర్ మరో విధంగా వ్యవహరించాల్సి ఉండాల్సి ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీకి జట్టు కెప్టెన్సీని మార్పిడి చేసినప్పుడు ఏ విధమైన వివాదం చెలరేగలేదు. దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీకి ధోనీ సహకరించే విధంగా మేనేజ్‌మెంట్ చూసింది. రోహిత్ శర్మ నుంచి పగ్గాలను శుభమన్ గిల్‌కు అప్పగించినప్పుడు గంభీర్ గానీ జట్టు మేనేజ్‌మెంట్ గానీ ఆ విధమైన పద్ధతినే అవలంబించి వుంటే సమస్య ఉత్పన్నం కాకపోయేది, వివాదం చెలరేగి వుండేది కాదు. టీ20 కెప్టెన్సీ మార్పు కూడా ఏ విధమైన సమస్య లేకుండా జరిగిపోయింది. రోహిత్ శర్మ నుంచి సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించారు. రోహిత్ శర్మ తనకు ఎలా సహకరించాడనే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్‌ను కదిలిస్తే చెప్తాడు. రోహిత్ శర్మగానీ, విరాట్ కోహ్లీ గానీ తమకు వయస్సు మించిపోతున్నదని అనుకుంటూనే ఉన్నారు. కానీ వారి రిటైర్మెంట్ జరగాల్సిన తీరులో జరగలేదు. తదుపరి జట్టుకు ఉపయోగపడే విధంగా సేవలనూ అనుభవాన్నీ సరిగా వాడుకోలేదు, వారికి తగిన గౌరవం ఇవ్వలేదు. ఇది చాలా స్పష్టం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టు నుంచి తొలగించాలని అనుకున్నప్పుడు గంభీర్ అందుకు ధీటైన ఆటగాళ్లను జట్టులోకి తేవాల్సి ఉండేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఐపిఎల్‌లో అటతీరును ప్రాతిపదికగా తీసుకుని టెస్టు జట్టును ఎంపిక చేశారు. రంజీ, దులీప్ ట్రోఫీలో ప్రదర్శించిన ఆటతీరును ప్రాతిపదికగా తీసుకోలేదు. సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఎత్తి చూపుతున్నారు. దానికితోడు, జట్టును ఆల్ రౌండర్లతో నింపేయాలనే గంభీర్ ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. రియల్ ఆల్ రౌండర్లు జట్టులో ఎవరున్నారని మనోజ్ తివారీ ప్రశ్నించారు. రవీంద్ర జడేజా, ఆక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్లు ఎలా అవుతారనేది ఆయన ప్రశ్న. ఆల్ రౌండర్ అంటే కపిల్ దేవ్, జాక్విస్ కల్లిస్, బోతమ్ మాదిరిగా ఉండాలనేది ఆయన అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. నితీష్ కుమార్ రెడ్డినే తీసుకుందాం. అతను ఆస్ట్రేలియా జట్టుపై చేసిన ఒకే ఒక సెంచరీ కారణంగా ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అతని ఆటతీరు పూర్తి పేలవంగా ఉంది. అతను ఇంకా ఆల్ రౌండర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు.
మరో విషయం ` ఆల్ రౌండర్ల ఎంపిక పేరుతో స్పెషలిస్టు బ్యాటర్లను తగ్గించారు. ముగ్గురు మాత్రమే స్పెషలిస్టులు ఉన్నారు. కెఎల్ రాహుల్, యశస్వి జయస్వాల్, శుబ్‌మన్ గిల్ మాత్రమే స్పెషలిస్టులు. వాళ్లు విఫలమైతే పరుగులు రాబట్టే మరో బ్యాటర్ జట్టులో లేడు. కనీసం ఐదుగురు స్పెషలిస్టులు టెస్టు జట్టులో అవసరం. దాన్ని పక్కన పెట్టేసి ఆల్ రౌండర్ల పేరుతో జట్టును నింపేశారు. అయితే ఆల్ రౌండర్లు బ్యాటింగ్‌లో నిలదొక్కుకోలేక చతికలపడుతున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేయడం మాట అటుంచి ఆత్మరక్షణ కూడా చేసుకోలేని దుస్థితిలో జట్టు పడిపోవడానికి అదో కారణం. నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసి సాధించింది ఏమీ లేదు. పైగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నిర్హేతుకమైన మార్పులు మరో సమస్యగా మారింది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చూస్తే దిమ్మతిరుగుతుంది. మూడో స్థానంలో ఒకరిపై నమ్మకంతో స్థిరంగా కొనసాగించిన దాఖలా లేదు. సాయి సుదర్భన్, గిల్, వాషింగ్టన్ సుందర్ ఇలా మూడో స్థానంలో తరుచుగా మార్పులు చేస్తూ వచ్చారు. బ్యాటింగ్ లైనప్‌లో అర్థం లేని ప్రయోగాలు చేశారు. దీంతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కొరవడి, నిలకడగా ఆడలేని స్థితి నెలకొంది. తమ పాత్ర ఏమిటో కూడా తెలియని స్థితిలోకి బ్యాటర్లు వెళ్లిపోయారు. వివియస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి బ్యాట్స్‌మెన్ లోపం ప్రస్తుత జట్టులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లక్ష్యం కోసం, అంటే జట్టు విజయం కోసం కాకుండా వ్యక్తిగత మనుగడ కోసం ఆడాల్సిన పరిస్థితి ఆటగాళ్లకు దాపురించింది.
పిచ్‌ల తయారీని భారత బ్యాటర్ల కన్నా విదేశీ ఆటగాళ్లు గొప్పగా వాడుకున్నారు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్‌ను మనవాళ్లు ఏ మాత్రం ఎదుర్కోలేకపోయారు. స్పిన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్లను ఆడడం మన బ్యాటర్లు మరిచిపోయినట్లే ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్వీప్ షాట్లు ఎంత సమర్థంగా కొట్టారో మనకు అర్థమవుతూనే వుంది. నిజానికి, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే టెస్టు క్రికెట్ గందరగోళంలో పడింది. డ్రెసింగ్ రూంలోని వాతావరణం మైదానంలో ప్రతిఫలిస్తూ వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆడినప్పుడు అనుభవం గల క్రికెటర్లే ఉన్నారు కదా అని గంభీర్ తప్పించుకోవడానికి చూశాడు. కానీ, అనుభవం గల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా తగిన ప్రదర్శన చేయలేని వాతావరణం చోటు చేసుకుందని అనుకోవాల్సి ఉంటుంది. సీనియర్లను పక్కన పెట్టాలనే గంభీర్ ఆలోచన అందుకు కారణం కావచ్చు. జట్టు కూర్పు విషయంలోనూ, మైదానంలోకి దిగే 11 మంది ఆటగాళ్ల విషయంలోనూ రెండో మాట ఉండకూడదనే పద్ధతిలో గంభీర్ వ్యవహారశైలి ఉందనేది అర్థమవుతూనే ఉన్నది. అంతకు ముందు జట్టు ఎంపికలోనూ, మైదానంలోకి దిగే అటగాళ్ల విషయంలోనూ కెప్టెన్ మాటకు విలువ ఉండేది. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు సంభవించిన పరిణామాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. ధోనీ మాటతోనే సెహ్వాగ్, వివియస్ లక్ష్మణ్ వంటివాళ్లను బిసిసీఐ సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టింది. అప్పుడు ధోనీ మీద విమర్శలు వచ్చాయి. కానీ ధోనీ జట్టును నిలిపిన తీరును, పటిష్టంగా తయారు చేసిన తీరు ఆ విమర్శలకు విలువ లేకుండా చేశాయి. కానీ హెడ్ కోచ్‌గా గంభీర్ వ్యవహార శైలి విమర్శలకు గురి కావడానికి సరైన జట్టును తయారు చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు, విఫలమవుతారు కూడా.
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై గంభీర్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రిటైర్మెంట్‌పై అశ్విన్ గానీ, అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మగానీ విమర్శలేమీ చేయలేదు. ఎవరినీ నిందించలేదు. కానీ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భం, అప్పటి పరిణామాలు మాత్రం పలు అనుమానాలకు తావు కల్పించింది. సిరీస్ మధ్యలో అర్థంతరంగా అతను రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్టు క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదంతా గంభీర్ తీరు వల్ల జరిగిందనే అనుమానాలు వ్యాపించాయి. నిజం కూడా అదే కావచ్చునని అనిపిస్తున్నది.
ఇంతకు ముందు లేని విమర్శ ఒక్కటి బిసీసిఐ ప్రస్తుతం ఎదుర్కుంటున్నది. 1983 ప్రపంచకప్ విజేత జట్టుకు నాయకత్వం వహించిన కపిల్ దేవ్ నర్మగర్భంగానే అయినా ఆ విషయాన్ని బయట పెట్టారు. రాజకీయ జోక్యం గురించి ఆయన మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి జయ్‌షాపై రాజకీయ కోణంలో విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వ్యవహారశైలి వల్ల ఆ విమర్శలకు పెద్దగా ప్రచారం లభించడం లేదు. గంభీర్ వ్యవహారశైలి మాత్రం విమర్శలకు గురువుతున్నది. గౌతమ్ గంభీర్ బిజెపి ఎంపీగా పనిచేశారు. దాంతో బిసీసీఐలోకి కూడా రాజకీయాలు ప్రవేశించాయనే మాట వినిపిస్తున్నది. మొహమ్మద్ షమీని పక్కన పెట్టేసి హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలోనూ స్థానం కల్పించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. హర్షిత్ రాణా ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే మంచి ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శన రోహిత్ శర్మ సూచనల వల్లనే సాధ్యమైందని రాణా నిర్మొహమాటంగా చెప్పాడు. ఇక్కడే మరో మాట చెప్పుకోవాలి. హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించానని గంభీర్ అన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ రూపొందించారని మనోజ్ తివారీ అన్న మాటల్లో ఎంతో నిజం ఉంది.
మొత్తంగా, భారత టెస్టు జట్టు తీరుపై సీనియర్ ప్లేయర్లు చాలా మంది విమర్శలు చేస్తూనే వున్నారు. వ్యూహరచన, నైపుణ్యాలు, ఆటగాళ్ల దేహభాష అన్ని దిగదిడుడుపుగానే ఉన్నాయని మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ అన్నాడు. భారత ఆటగాళ్లలో సహనం, టెక్నిక్ లేదని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఈ స్థితిలో సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్‌గా నియమించి, జట్టు దారిలో పడిన తర్వాత ఆ స్థానాన్ని రాహుల్ ద్రావిడ్‌కు అప్పగించాలనే డిమాండ్ కూడా ఉంది. కాగా, దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ ఆడనున్నారు. ఈ సిరీస్ ఫలితం ఏమైనా గంభీర్ విషయంలో పునరాలోచనకు తావు ఇస్తుందా చూడాలి. కానీ టెస్టు జట్టుకు మాత్రం కాయకల్ప చికిత్స అవసరమే.