Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు

Published : Sep 14, 2026, 01:32 PM IST

Asia Cup 2026 Trophy : మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను ఓడించిన భారత్ విజేతగా నిలిచింది. ఏసీసీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుకు టీమిండియా ట్రోఫీ తీసుకోలేదు. స్టేడియంలో అభిమానులు కేకలు వేయడంతో నఖ్వీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

PREV
15
ట్రోఫీ చోర్ నినాదాలు.. పారిపోయిన పాక్ మంత్రి, ఏసీసీ చీఫ్ నఖ్వీ

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఊహించని వివాదం చెలరేగింది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకపై 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఎనిమిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్ హోం మంత్రి అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది.

రాత్రి 11:25 గంటలకు మ్యాచ్ పూర్తయినప్పటికీ, ప్రెజెంటేషన్ సెర్మనీ అరగంటకు పైగా ఆలస్యమైంది. మైదానంలో సాధారణంగా జరిగే విన్నర్స్ సెర్మనీకి టీమిండియా రాలేదు. దీంతో బ్రాడ్‌కాస్టర్లు మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంటర్వ్యూ పూర్తి చేసి పంపించారు. ఆ తర్వాత పర్వేజ్ మహరూఫ్ విజేతలకు ట్రోఫీ ఇవ్వకుండానే కార్యక్రమాన్ని ముగించారు.

25
స్మృతి మంధాన రియాక్షన్.. పారిపోయిన నఖ్వీ

డ్రెస్సింగ్ రూమ్ నుంచి భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బయటకు వచ్చారు. అయితే స్టేజ్ మీద మొహసిన్ నఖ్వీ నిలబడి ఉండటం చూసి ఆమె నవ్వుకుంటూ తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. ఈ దృశ్యం చూసి స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులు బిగ్గరగా "ట్రోఫీ చోర్.. ట్రోఫీ చోర్" అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు.

అభిమానుల నినాదాలు, భారత ఆటగాళ్ల వైఖరితో అసహనానికి గురైన మొహసిన్ నఖ్వీ స్టేజ్ దిగి వేగంగా స్టేడియం వెలుపలికి వెళ్ళిపోయారు. నఖ్వీ వెళ్లిపోయే వరకు భారత ఆటగాళ్ళు తమ నిర్ణయానికే కట్టుబడి డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అంతర్జాతీయంగా నఖ్వీ పరువు పోయినట్లయింది.

35
ఇది బీసీసీఐ నిర్ణయం.. హెడ్ కోచ్ అమొల్ మజుందార్

ఈ వివాదంపై భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అమొల్ మజుందార్ స్పష్టత ఇచ్చారు. ప్రెజెంటేషన్ సెర్మనీలో పాల్గొనకపోవడం, నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోకపోవడం తమ సొంత నిర్ణయం కాదని, ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న అధికారిక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

"ఇది బీసీసీఐ తీసుకున్న స్పష్టమైన నిర్ణయం. మేమందరం బోర్డు తీసుకున్న స్టాండ్‌కు కట్టుబడి ఉన్నాం. మాకు ఈ టోర్నమెంట్ పూర్తయింది. మేమే ఆసియా ఛాంపియన్లము, అది మాకు చాలు. మా దృష్టి ఇప్పుడు రాబోయే ఆసియా క్రీడలపైనే ఉంది" అని మజుందార్ వెల్లడించారు.

45
2025 మెన్స్ ఆసియా కప్ వివాదం రిపీట్

పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న సరిహద్దు తీవ్రవాదం, ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీని ప్రభావం క్రీడారంగంపై కూడా పడింది. గతేడాది 2025లో యుఏఈలో జరిగిన పురుషుల ఆసియా కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ సమయంలో కూడా ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి సూర్యకుమార్ సేన నిరాకరించింది.

ఆ రోజు ప్రెజెంటేషన్ కోసం దాదాపు 90 నిమిషాల సమయం వృథా అయినా భారత్ తగ్గలేదు. దీంతో నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోగా, భారత ప్లేయర్లు రోహిత్ శర్మ శైలిలో స్లో వాక్ చేస్తూ.. చేతిలో ట్రోఫీ ఉన్నట్లు నటిస్తూ ఎత్తి పండుగ చేసుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తిరగకుండానే మహిళల జట్టు కూడా అదే చరిత్రను రిపీట్ చేసింది.

55
ఫైనల్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం

వివాదం పక్కన పెడితే, మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 68), స్మృతి మంధాన (39 బంతుల్లో 59) మైండ్ బ్లోయింగ్ స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 183/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు శ్రీ చరణి (4 వికెట్లు), దీప్తి శర్మ (3 వికెట్లు) దెబ్బకొట్టారు. దీంతో శ్రీలంక జట్టు 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో 2024 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయ ఛాంపియన్‌గా నిలిచినా, ట్రోఫీ కోసం మాత్రం టీమిండియా ఇంకా వేచి చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories