IND vs AUS: ఇండియా vs ఆస్ట్రేలియా టీ20.. సూర్య‌కుమార్ కెప్టెన్సీలోని కొత్త జ‌ట్టు ప్ర‌తీకారం తీర్చుకుంటుందా?

First Published | Nov 23, 2023, 12:31 PM IST

IND vs AUS T20 Series: భారత జట్టు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ షమీ, జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 
 

IND vs AUS 1st T20: ఐసీసీ వన్డే వరల్డ్ క‌ప్ బాధను చెరిపివేసి టీ20 ఫార్మాట్ లో సరికొత్త ఆరంభానికి భారత్ సిద్ధమైంది. ప్రపంచకప్ లో ఆడిన కీలక ఆటగాళ్లను రిటైన్ చేస్తూ ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా నేడు ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ప్రపంచకప్ ఆడిన‌వారు ఉన్నారు.

వచ్చే ఏడాది జూన్ లో వెస్టిండీస్, అమెరికాలో టీ20 వరల్డ్ క‌ప్ జరగాల్సి ఉంది. ఇకపై భారత్ ఈ ఫార్మాట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టనుంది. టీ20 ఫార్మాట్ కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ప్రపంచకప్ సమయంలో గాయపడటంతో సూర్యను కెప్టెన్ గా నియమించారు. ఐసీసీ టీ20 ఫార్మాట్ లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న అతడు ఇటీవలి కాలంలో పేలవమైన ఫామ్ ఇబ్బంది క‌లిగిస్తోంది. 


ఫైనల్ సహా ప్రపంచకప్ లో తనకు వచ్చిన చాలా అవకాశాలను సూర్యకుమార్ వృధా చేసుకున్నాడు. ఫైనల్లో 28 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అంతేకాకుండా చివరి ఓవర్లలో సింగిల్స్ కోసం నెట్ టైలర్లకు స్ట్రైక్ ఇచ్చిన సూర్య తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. 360 డిగ్రీల వద్ద తిరిగినా షాట్లు తీయడంలో దిట్ట అయిన సూర్య బ్యాట్ ఝ‌ళిపించ‌లేక‌పోయాడు. వరల్డ్ కప్ జట్టులో ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణలు ఉన్నారు. 
 

తొలి మూడు మ్యాచ్ లకు రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ లకు విశ్రాంతి ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా తిరిగి వస్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, జడేజా జట్టులో లేరు.
 

టీ20 ఫార్మాట్లో భారత్ చివరిసారిగా ఆగస్టులో ఐర్లాండ్ తో ఆడింది. ఆ జట్టులో ఉన్న సంజూ శాంస‌న్, షాబాజ్ లను ఇప్పుడు తప్పించారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్. రెండో వికెట్ కీపర్ గా జితేష్ శర్మకు అవకాశం లభించింది.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో రాణించిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆసియా గేమ్స్ లో టీమిండియాకు కోచ్ గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్ లో టీమిండియాకు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నాడు.

భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు భార‌త్ జ‌ట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.
 

ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాకు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సారథ్యం వహించనున్నాడు. ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగిలిస్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నారు.
 

అయితే, వచ్చే నెలలో పాకిస్థాన్ తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కు ముందు ప్యాట్ కమిన్స్, హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ స్వదేశానికి చేరుకున్నారు. తొలుత టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్న డేవిడ్ వార్నర్ కూడా టెస్టులపై దృష్టి సారించేందుకు సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్వదేశానికి తిరిగిరావడంతో ఈ సిరీస్ కు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ గా అసిస్టెంట్ కోచ్ ఆండ్రీ బోరోవాక్ వ్యవహరించనున్నాడు. 

Latest Videos

click me!