
2025 టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభించింది. ఇంగ్లాండ్ వేదికగా ఆడుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత జట్టు 3393 పరుగులు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇదివరకూ ఈ ఘనత దక్షిణాఫ్రికా జట్టుతో పేరుతో ఉంది. 2003లో సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం 3088 పరుగులు చేసింది.
ఈ ప్రదర్శనతో భారత్ "ఇంగ్లాండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన అతిథి జట్టు"గా నిలిచింది. ఈ రికార్డుతో భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. పరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ సిరీస్‌ను భారత ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రభావితం చేసింది. టీమిండియా మొత్తం 3393 పరుగులు చేసింది. పలువురు ఆటగాళ్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన జట్ల రికార్డులు ఇలా ఉన్నాయి..
భారత్ - 3393 పరుగులు (2025)
దక్షిణాఫ్రికా - 3088 పరుగులు (2003)
వెస్టిండీస్ - 3041 పరుగులు (1976)
ఆస్ట్రేలియా - 3014 పరుగులు (1934)
ఆస్ట్రేలియా - 2858 పరుగులు (1948)
ఇంకా రెండో ఇన్నింగ్స్ మిగిలి ఉంది కాబట్టి మరిన్ని పరుగులు రానున్నాయి. ఈ లిస్ట్ ఆధారంగా చూస్తే భారత్ తన బ్యాటింగ్ పవర్ ను స్పష్టంగా చూపించింది.
టెస్టు సిరీస్ లో భారత్ పరుగుల రికార్డు
ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్ ఓవల్ మైదానంలో జరుగుతోంది. సచిట్ టెండూల్కర్- జేమ్స్ అండర్సన్ ట్రోఫీలో జరుగుతున్న ఈ మ్యాచ్ ను భారత్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.
రెండో రోజు భారత ప్లేయర్లు అందరూ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో 224 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. కరుణ్ నాయర్ 57 పరుగులు, సాయి సుదర్శన్ 38 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో గుస్ అట్కిన్సన్ 5 వికెట్లు, జోష్ టంగ్ 3 వికెట్లు తీసుకున్నారు. క్రిస్ వోక్స్ కు ఒక వికెట్ దక్కింది.
భారత్ ఓవల్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్ హెడింగ్లీ, లీడ్స్ వేదికగా జరిగింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది.
రెండో మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ లో జరగ్గా.. ఇండియా 336 పరుగుల తేడాతో గెలిచింది. మూడో టెస్టు మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 22 పరుగులతో తెలిచింది. నాల్గో మ్యాచ్ మాంచెస్టర్ లో జరగ్గా.. ఇది డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ ఓవల్ లో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్ భారత్ కు ఎంతో కీలకం. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ తర్వాత కరుణ్-సుందర్ భాగస్వామ్యంతో పునరాగమనం చేసింది. కానీ, రెండో రోజు భారత బ్యాటింగ్ లైనప్ త్వరగానే కుప్పకూలింది. 224 పరుగులకే ఆలౌట్ అయింది.
బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ పిచ్‌పై రెండో రోజు భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లాండ్ ను పెద్ద స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. మూడో సెషన్ లో ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 235 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టుకు 11 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, ప్రసిద్ధ్ క్రిష్ణ 4 వికెట్లు తీసుకున్నారు. ఆకాశ్ దీప్ కు 1 వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ 64 పరుగులు, బెన్ డకెట్ 43 పరుగులు చేశారు. హ్యారీ బ్రూక్ 47 పరుగులు, జో రూట్ 29 పరుగుల నాక్ ఆడారు