ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భార‌త్ జోరు !

First Published | Feb 5, 2024, 5:59 PM IST

WTC Points Table: భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. వైజాగ్ టెస్టులో టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
 

india, cricket

India vs England: విశాఖ‌లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌ర్చింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భార‌త జ‌ట్టు విజ‌యంలో య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించాడు. గెలుపుతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భార‌త్-ఇంగ్లాండ్ లు 1-1తో స‌మంగా నిలిచాయి. అయితే, టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.

విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో భారత్ పీసీటీ 52.77కు చేరడంతో పీసీటీ 50 ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లను అధిగమించగలిగింది. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 55 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Latest Videos


కాగా, ఇంగ్లాండ్ తో హోరాహోరీగా సాగిన రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించ‌డంతో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. అయితే, మధ్యాహ్నం సెషన్ లో ఆ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో పుంజుకోవడానికి భారత్ రెండు సెషన్ల వ్యవధిలో తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/71), అక్షర్ పటేల్ (1/75), కుల్దీప్ యాదవ్ (1/60)ల‌ సమష్టి కృషితో భార‌త్ విజ‌యం సాధించింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో భార‌త పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీసుకున్నాడు. అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చెల‌రేగిన బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది. కాగా, భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానుంది. 

click me!