అదరగొట్టిన తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్.. భారత్ ఖాతాలో ఆసియా కప్ 9వ టైటిల్

Published : Sep 29, 2025, 01:16 AM IST

India vs Pakistan Final : దుబాయ్‌లో ఆసియా కప్ 2025 ఫైనల్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ హాఫ్ సెంచరీ నాక్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో పాకిస్తాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 9వ సారి ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది.

PREV
15
9వ ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్

దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి 9వ టైటిల్ కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (69 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ కు విజయాన్ని అందించాడు. తిలక్ తో పాటు కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు) అద్భుతమైన స్పెల్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచాయి.

25
పాకిస్తాన్ అద్భుత ఆరంభం, కానీ మధ్యలో కుప్పకూలింది

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 12.4 ఓవర్లలో 113/1 వద్ద బలంగా నిలిచింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కానీ ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి చివరి 9 వికెట్లను కేవలం 33 పరుగులకే కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను కూల్చేశాడు. చివరికి పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది.

35
భారత బౌలర్ల ఆధిపత్యం

భారత్ బౌలర్లు మధ్య ఓవర్లలోనే మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కుల్దీప్ యాదవ్ 4/30, అక్షర్ పటేల్ 2/26, జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి – 2 వికెట్ల బౌలింగ్ ప్రదర్శనతో పాక్ ను దెబ్బకొట్టారు. డెత్ ఓవర్లలో భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. చివరి ఐదు ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది.

45
భారత బ్యాటింగ్‌లో తిలక్ వర్మ సూపర్ షో

147 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో భారత్ ఆరంభంలో తడబడింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ త్వరగానే ఔటయ్యారు. ఒక దశలో స్కోరు 36/3గా ఉండగా, తిలక్ వర్మ ధైర్యంగా పాక్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. 

సంజూ శాంసన్ తో కలిసి 50+ రన్స్ భాగస్వామ్యం నమోదు చేశాడు. సంజూ అవుట్ అయిన తర్వాత శివమ్ దూబేతో కలిసి మరో 50 రన్స్ భాగస్వామ్యం చేసి జట్టును విజయానికి చేర్చాడు. తిలక్ 53 బంతుల్లో 69 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అజేయ ఇన్నింగ్స్ భారత్ కు విజయాన్ని అందించాడు.

త్వరగానే మూడు వికెట్లు కోల్పోయి భారత్ తీవ్ర ఒత్తడిలో ఉన్న సమయంలో తిలక్ వర్మ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మరో ఎండ్ లోకి వచ్చిన ఆటగాళ్లతో కలిసి భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. వికెట్ పడకుండా రన్ రేట్ భారం పెరగకుండా భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. మరోసారి ఒత్తిడిలోనూ తన బ్యాట్ పవర్ ఎలా ఉంటుందో చూపించాడు తిలక్ వర్మ.

55
చివరి ఓవర్‌లో గెలుపు పరుగులు కొట్టిన రింకూ సింగ్

భారత్‌కు 24 బంతుల్లో 36 పరుగులు అవసరమైన సమయంలో తిలక్ వర్మ, శివమ్ దూబే భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించింది. దూబే (33) ఔటైనా, చివరి ఓవర్‌లో భారత్‌కు 10 పరుగులు కావాల్సింది. తిలక్ వర్మ ఒక సిక్స్, ఒక సింగిల్‌తో స్కోరు సమం చేశాడు. 

చివరగా రింకూ సింగ్ బౌండరీ బాది భారత్‌ను 19.4 ఓవర్లలో 150/5 స్కోరుతో గెలిపించాడు. ఇక్కడ ఆసక్తిని పెంచే విషయమేమిటంటే రింకూ సింగ్ కు ఇది తొలి ఆసియా కప్, ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడాడు.. అది ఫైనల్. అలాగే, ఇక్కడ ఒకే బంతిని ఎదుర్కొన్నాడు. దానిని ఫోర్ గా కొట్టి భారత్ కు గెలుపు పరుగులు అందించాడు. టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు.

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ బ్రీఫ్ స్కోర్స్

పాకిస్తాన్: 146 (19.1 ఓవర్లు) – సాహిబ్‌జాదా ఫర్హాన్ 57, ఫఖర్ జమాన్ 46; కుల్దీప్ యాదవ్ 4-30, అక్షర్ పటేల్ 2-26

భారత్: 150/5 (19.4 ఓవర్లు) – తిలక్ వర్మ 69*, శివమ్ దూబే 33; ఫహీమ్ అష్రఫ్ 3-29, షాహీన్ అఫ్రిది 1-20

మొత్తంగా పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంలో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ కీలక పాత్ర పోషించింది. అలాగే, భారత బౌలర్లు రాణించడంతో పెద్దస్కోరును పాక్ చేయలేకపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories