IND vs PAK: ఆసియా కప్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక పహల్గామ్ దాడి తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం స్టేడియంలోనూ కనిపించింది.
2025 ఆసియా కప్ ఫైనల్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. భారత్ ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది 9వ సారి కావడం విశేషం. టోర్నమెంట్ అంతా పాకిస్థాన్ ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. ప్రతి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఫైనల్లో కూడా ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
25
రన్నరప్ చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్
మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తన కోపాన్ని దాచలేకపోయాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం చేతిలో నుంచి రన్నరప్ చెక్కును తీసుకున్నా, వెంటనే తిరిగి దానిని నేలపైకి విసిరేశాడు. ఈ ఘటన చూసి ప్రేక్షకులు బిగ్గరగా కేకలు వేశారు. ఆఘా ప్రవర్తన పాకిస్థాన్ జట్టు పరిస్థితిని స్పష్టంగా తెలిపింది.
35
ఓటమిపై సల్మాన్ అఘా స్పందన
తన జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేస్తూ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడిన ఆయన.. "ఇప్పుడు ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ మేము ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం. అందుకే ఫలితం మాకు అనుకూలంగా రాలేదు" అని చెప్పాడు. ఫైనల్లో ఓటమి తట్టుకోలేకపోయిన అతని ప్రవర్తన అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
భారత్ విజేతగా నిలిచినా, ట్రోఫీని స్వీకరించడం చుట్టూ వివాదం చెలరేగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "గెలిచిన జట్టు గుర్తుండిపోతుంది, ట్రోఫీ కాదు. నాకు నిజమైన ట్రోఫీ నా ఆటగాళ్లు మాత్రమే" అని స్పష్టం చేశాడు.
55
ఉద్రిక్తత వాతావరణంలోనే
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా టోర్నమెంట్ మొత్తం భారత్-పాక్ జట్ల మధ్య ఉద్రిక్తతలు అధికంగా ఉన్నాయి. టోర్నమెంట్‌లో భారత్ పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటినీ గెలిచింది. మ్యాచ్‌లలో కరచాలనం చేయకపోవడం ద్వారా కూడా భారత జట్టు తమ ధోరణిని స్పష్టం చేసింది. మొత్తం పాకిస్థాన్‌కు టీమిండియా సరైన బుద్ధి చెప్పిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.