Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ ను ఓడించి భారత్ 9వసారి టైటిల్ గెలిచింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం.. 9వసారి ఆసియా కప్ ఛాంపియన్
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ అద్భుతమైన ఆటతీరుతో పాకిస్తాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. గత 5 టోర్నమెంట్‌లలో 4 సార్లు ట్రోఫీని దక్కించుకోవడం ద్వారా భారత్ మరోసారి ఆసియా కప్ లో తన ఆధిపత్యాన్ని చూపించింది.
25
పీసీబీ మొహ్సిన్ నఖ్వీకి షాకించిన భారత జట్టు
మ్యాచ్ ముగిసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ట్రోఫీ ప్రదానోత్సవం. పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, అలాగే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఈ నిర్ణయానికి బలంగా కట్టుబడివుండటంతో.. కొంతసమయం తర్వాత కూడా ట్రోఫీని స్వీకరించలేదు. దీంతో అక్కడ మరో డ్రామా నడిచింది. ఇక్కడ పాకిస్తాన్ కు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. భారత్ ట్రోఫీ లేకుండానే గెలుపు సంబరాలు చేసుకుంది.
35
పాకిస్తాన్ జట్టుకు హూటింగ్
మ్యాచ్ తర్వాత రన్నర్-అప్ మెడల్స్ అందుకునేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు స్టేజ్‌పైకి రాగా, స్టేడియంలో ఉన్న భారత అభిమానులు గట్టిగా హూటింగ్ చేశారు. భారత అభిమానులు పాకిస్తాన్ ఆటగాళ్లు మెడల్స్ తీసుకుంటున్నప్పుడు గట్టిగా అరుస్తూ, వ్యంగ్యంగా స్టేడియం హోరెత్తించారు. ఇది పాకిస్తాన్ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నిరాశ వ్యక్తం చేస్తూ.. ఈ ఓటమి చాలా బాధాకరమని పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నారు.
ట్రోఫీ మాత్రమే కాకుండా భారత ఆటగాళ్లు మెడల్స్ కూడా స్వీకరించలేదు. దీంతో మరోసారి వివాదం తలెత్తింది. సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో కలిసి ట్రోఫీ ఫోటోషూట్ చేయడానికీ అంగీకరించలేదు. ఇదే టోర్నమెంట్‌లో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి నిరాకరించారు.
మొత్తానికి, భారత్ అద్భుత విజయాన్ని సాధించినప్పటికీ, ట్రోఫీ ప్రదానోత్సవం వివాదాస్పదంగా మారి ఆసియా కప్ చరిత్రలో ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచిపోయింది.
55
ఆసియా కప్ 2025 భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ముఖ్యాంశాలు
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. తర్వాత భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిచింది. తిలక్ వర్మ 69 నాటౌట్ పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు.