
2026లో భారత్, శ్రీలంకలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా టీ20 జట్టులో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, మెంటార్‌గా, కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆధారంగా గంభీర్ భారత టీ20 జట్టును రీబ్రాండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఆసియా కప్, ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో కొత్త విధానం ప్రకారం ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పుడు భారత క్రికెట్ సర్కిల్ లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది.
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా పలు రిపోర్టులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. గిల్ టెస్టు కెప్టెన్ గా ఉండగా, సూర్య కుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా ఉన్నారు.
ఆసియా కప్ ముగిసిన తర్వాత శుభ్ మన్ గిల్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గిల్ కొత్త నాయకత్వం చేపట్టవచ్చని సూచనలు వెలువడుతున్నాయి.
భారత జట్టులో ఇకపై ప్రత్యేక ఫినిషర్ పాత్ర ఉండదని సమాచారం. ప్రతి ఆటగాడికి తన ప్రతిభను బట్టి పాత్ర ఇవ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నారని సంబంధిత క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
శివమ్ దుబే లాంటి బ్యాట్స్‌మెన్‌ను కేవలం ఫినిషర్ పాత్రలో మాత్రమే పరిమితం చేయకుండా, అవసరమైతే ముందుగానే బ్యాటింగ్ ఆర్డర్‌లోకి పంపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ నుంచే ఈ మార్పులు ప్రారంభం కావచ్చని సమాచారం.
గత ఏడాది ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 నుంచి రిటైర్ కావడంతో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ వచ్చింది. అతని నాయకత్వంలో భారత్ 22 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించింది.
అయితే, అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ విధానం అమలు చేస్తే టీ20లలో మాత్రమే ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కోల్పోయే అవకాశముంది. ఆసియా కప్‌కి ముందు ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితే సూర్యకుమార్ తిరిగి కెప్టెన్‌గా కొనసాగుతారని అంచనాలు ఉన్నా, మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ఫిట్ గా ఉన్నారు.. ఆసియా కప్ లో 2025 భారత జట్టును ముందుకు నడిపిస్తారని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీ20 ఫార్మాట్‌కి ప్రత్యేకంగా తగిన ఆటగాళ్లను గుర్తించి వారికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నారని రిపోర్టులు వెల్లడించాయి. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన బ్యాట్స్‌మెన్, బౌలర్లకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టుని నడిపించే అవకాశం ఉండగా, శుభ్ మన్ గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. గిల్ టీ20 జట్టులో ఉంటే బ్యాటింగ్ కాంబినేషన్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న జైస్వాల్ వచ్చినా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు ఉంటాయి.
మొత్తంగా గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియాలో పెద్ద మార్పులు జరుగనున్నాయని సంకేతాలు స్పష్టమవుతున్నాయి. 2026 ప్రపంచకప్‌కు ముందు టీ20 జట్టులోనే కాకుండా, మూడు ఫార్మాట్లలోనూ ఒకే కెప్టెన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త దిశలో అడుగులు వేయనున్నట్లు భారత క్రికెట్ సర్కిల్ లో టాక్ బలంగానే వినిపిస్తోంది.