
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు జరుగనుంది. ఈసారి టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా నిర్వహించనున్నారు.
2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆసియా కప్‌ను కూడా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. భారత జట్టు ఆసియా కప్ 2025 టోర్నీ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
ఆసియా కప్ 2025 టోర్నీకి భారత్ తరఫున 15 మంది క్రికెటర్లతో కూడిన బలమైన టీం ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే తాజా రిపోర్టుల ప్రకారం, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీలో పాల్గొనకపోవచ్చని సమాచారం.
సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సర్జరీ చేయించుకోవడంతో అతను ఫిట్‌నెస్ ను పూర్తిగా సాధించే విషయంలో కాస్త వెనుకబడినట్లు టైమ్స్ నౌ నివేదిక పేర్కొంది. అతని స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని క్రికెట్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది.
ఇక ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. అతను తన చివరి టీ20 మ్యాచ్‌ను టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో ఆడిన సంగతి తెలిసిందే. జైస్వాల్ విషయంలో ఓపెనింగ్ కోసం ఇప్పటికే శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఉన్నందున, అతనికి స్థానం దక్కడం క్లిష్టంగా మారిందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా, ప్రధాన ఆల్‌రౌండర్‌గా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్‌ను రెండో ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
బుమ్రా లేకపోవడంతో పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా లేదా యశ్ దయాల్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఎవరో ఒకరు ఎంపికవుతారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ప్రధాన స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉండనున్నారు.
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురేల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా / ప్రసిద్ధ్ కృష్ణా / యశ్ దయాల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆసియా కప్ లో 8 జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూపులుగా టీమ్స్ ను విభజించారు. టోర్నీలో గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, యూఏఈ (UAE), ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి.
సెప్టెంబర్ 14న గ్రూప్ దశలో భారత్ vs పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు సూపర్ 4కి చేరితే మళ్లీ తలపడే అవకాశం ఉంది. అలాగే, ఫైనల్ చేరితే మూడో సారి (సెప్టెంబర్ 28న) భారత్ - పాక్ లు తలపడే ఛాన్స్ ఉంది.
2023లో కొలంబోలో జరిగిన ఆసియా కప్ 50 ఓవర్ల ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన భారత్ టైటిల్ గెలుచుకుంది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతోంది. కాగా, భారత్ ఈ టోర్నీకి నిర్వాహక దేశంగా హక్కులను కలిగి ఉంది. అయితే, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈని టోర్నీ వేదికగా ఎంపిక చేసింది బీసీసీఐ.
మేలో జరిగిన భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా టోర్నీ జరుగుతుందా? అనే ప్రశ్నలు వచ్చాయి. జరిగితే భారత్ ఆడటం కష్టమేనని రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ, ఆసియా కప్ లో ఆడాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. జూలై 24న ఢాకాలో జరిగిన ఏసీసీ (ACC) సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చింది.
ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరగబోయే ఆసియా కప్ 2025 టోర్నీలో కొత్త ముఖాలతో పాటు అనుభవం కలగలిసి ఉన్న భారత జట్టు, మరోసారి టైటిల్ గెలిచే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.