దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ సంచలనం అభిజ్ఞాన్ కుందు చరిత్ర సృష్టించాడు. మంగళవారం మలేషియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై వికెట్ కీపర్-బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 125 బంతుల్లో 209 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూత్ వన్డేల చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
కుందు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల నాటి అంబటి రాయుడు రికార్డును అధిగమించడమే కాకుండా, జట్టు స్కోరును 408 పరుగుల భారీ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
రికార్డుల మోత మోగించిన అభిజ్ఞాన్ కుందు
మలేషియా బౌలర్లపై విరుచుకుపడిన అభిజ్ఞాన్ కుందు కేవలం 121 బంతుల్లోనే తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది అండర్-19 వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన జోరిచ్ వాన్ షాల్క్‌విక్ (145 బంతులు) పేరిట ఉండేది.
కుందు తన ఇన్నింగ్స్‌లో మొత్తం 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాదాడు. 125 బంతుల్లో 209 పరుగులతో అజేయంగా నిలిచిన కుందు.. 2002లో ఇంగ్లండ్‌పై అంబటి రాయుడు సాధించిన 177 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, ఇదే టోర్నీలో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ చేసిన 171 పరుగుల రికార్డును కూడా కుందు అధిగమించాడు.