Business Idea
ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా వాము ఉంటుందని తెలిసిందే. నిత్యం మనం ఉపయోగించే ఈ వాము ఎలా పండిస్తారన్న విషయం మాత్రం మనలో చాలా తక్కువ మందికే తెలుస్తుంది. అయితే వాము సాగుతో భారీగా లాభాలు పొందొచ్చని మీకు తెలుసా.? ఇతర పంటలతో పోల్చితే వామును తక్కువ శ్రమతో పండించవచ్చు. ఎలాంటి నేలలోనైనా వాము సాగు చేయొచ్చు. నల్లరేగడి, తేలికపాటి నేలల్లో కూడా వామును ఎంచక్కా పండించుకోవచ్చు. ఇంతకీ వాము సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో మీకోసం.
సాధారణంగా వాము పంటను ఆగస్టులో వేస్తారు. విత్తనాలు చల్లిన తర్వాత కేవలం 5 నెలల్లోనే పంట చేతికి వస్తుంది. విత్తనం నాటిన రెండు నెలలకు ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. ఎరువులు, మందుల పిచికారీ తదితర ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎకరానికి సుమారు 4 నుంచి 5 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను 1-1.5 సెం.మీ లోతుగా నాటాల్సి ఉంటుంది. సేంద్రీయ ఎరువులు ఎకరానికి 8 టన్నుల వరకు కాంపోస్ట్ అవసరపడుతుంది.
పెట్టుబడి ఎంత పెట్టాల్సి ఉంటుంది.?
ఇక పంటకు ప్రతీ 15 రోజులకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది. మంచు కురిసే ప్రాంతాల్లో అయితే నీరుతో పెద్దగా అవసరం కూడా ఉండదు. పెట్టుబడి విషయానికొస్తే విత్తనాలకు సుమారు రూ. 200 వరకు అవుతుంది. ఎరువులకు రూ. 8 వేల వరకు ఖర్చవుతుంది. ఇక లేబర్ ఖర్చులకు దాదాపు రూ. 15 వేల వరకు అవుతంఉది. సరాసరి ఒక ఎకరానికి దాదాపు రూ. 25 వేల ఖర్చు అవుతుంది.
లాభాలు ఎలా ఉంటాయంటే..?
వాముకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేవలం వంటలకు మాత్రమే కాకుండా పలు రకాల ఔషధాల తయారీలో కూడా వామును ఉపయోగిస్తుంటారు. క్వింటాలు వాముకు సుమారు రూ. 19 వేల ధర పలుకుతోంది. ఎంత కాదన్న ఒక ఎకరాకు దాదాపు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఉదాహరణకు ఒక ఐదు ఎకరాల్లో వాము పండిస్తే ఎంత కాదన్న 30 క్వింటాళ్ల వాము దిగుబడి వస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే సుమారు రూ. 5.5 లక్షల ఆదాయం ఆర్జించవచ్చు. ఇలా కేవలం ఐదు నెలల్లోనే రూ. 5 లక్షల ఆదాయం పొందొచ్చన్నమాట.
గమనిక: ఆదాయం అనేది కచ్చితంగా పంట దిగుబడి. ఆ సమయంలో పంటకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు పండించిన పంటను ఎంత వరకు మార్కెట్ చేయగలుగుతున్నారన్నదానిపై మీకు వచ్చే ఆదాయం మారుతూ ఉంటుంది.