Budget 2026 Price Drops : కేంద్ర బడ్జెట్ 2026లో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ యంత్రాలు, కోబాల్ట్ వంటి ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొబైల్, ఈవీ ధరల తగ్గింపుకు దారితీయనుంది.
బడ్జెట్ 2026 దెబ్బకు ఈవీ బ్యాటరీల ధరలు డౌన్.. సామాన్యుడికి ఇక పండగే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్, దేశంలోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగానికి భారీ ఊరటనిచ్చింది. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో ఉపయోగించే 63 రకాల మూలధన వస్తువులకు కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
26
ఈవీ బ్యాటరీ తయారీకి ఊతం
ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. దీని ధరను తగ్గించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చింది. ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన మరో 35 అదనపు మూలధన వస్తువులను డ్యూటీ ఫ్రీ జాబితాలో చేర్చాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనివల్ల దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తి పెరగడమే కాకుండా, తయారీ సంస్థల వ్యయం కూడా భారీగా తగ్గుతుంది.
36
మొబైల్ ఫోన్ రంగానికి బూస్ట్
కేవలం ఈవీలు మాత్రమే కాకుండా, మొబైల్ ఫోన్ల బ్యాటరీల తయారీలో వాడే 28 రకాల యంత్ర సామగ్రిపై కూడా కస్టమ్స్ డ్యూటీని రద్దు చేశారు. మొబైల్ ఫోన్ల రంగంలో దేశీయ విలువ జోడింపును మరింత పెంచడానికి ఈ చర్య దోహదపడుతుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చు తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరకే ఫోన్లు లభించే అవకాశం ఉంది. లిథియం-అయాన్ బ్యాటరీల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరికరాలపై పన్ను తగ్గించడం వల్ల మేక్ ఇన్ ఇండియా నినాదం మరింత బలోపేతం కానుంది.
బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల విషయంలోనూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోబాల్ట్ పౌడర్, కోబాల్ట్ వ్యర్థాలు, లెడ్, జింక్ వంటి 12 కీలక ఖనిజాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2024 జూలై బడ్జెట్‌లో ఇప్పటికే 25 ఖనిజాలపై పన్ను రద్దు చేయగా, ఇప్పుడు మరిన్ని ఖనిజాలను ఆ జాబితాలో చేర్చారు. దీనివల్ల ముడిసరుకు లభ్యత సులభతరం కావడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
56
రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ
పర్యావరణ హితమైన చర్యల్లో భాగంగా, లిథియం-అయాన్ బ్యాటరీల స్క్రాప్ పై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం సున్నాకి తగ్గించింది. పాత బ్యాటరీల నుంచి లోహాలను తిరిగి సేకరించడం, రీసైక్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్యాటరీ వ్యర్థాలను ప్రాసెస్ చేయడం చౌకగా మారడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, కొత్త బ్యాటరీల తయారీకి అవసరమైన ముడిసరుకు దేశీయంగానే లభిస్తుంది.
66
వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఇవే
ముడిసరుకు, యంత్రాలపై పన్నులు తగ్గడం వల్ల బ్యాటరీల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రయోజనాన్ని తయారీ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తే, ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఆటోమొబైల్ రంగంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తూ సీఎన్‌జీలో బయోగ్యాస్ బ్లెండింగ్‌ను కూడా తప్పనిసరి చేశారు. ఈ చర్యలన్నీ కలిసి భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి బాటలు వేస్తున్నాయి.