Gold : ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

Published : Mar 16, 2026, 10:03 PM IST

Gold ownership rules India : భారతదేశంలో ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు, పరిమితులు, పత్రాల ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఇంట్లో ఎంత బంగారం ఉంటే ఐటీ రైడ్ చేయరు? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

Gold ownership rules India : మీ బీరువాలో భారీగా బంగారం దాచుకున్నారా? ఐటీ రైడ్ జరిగితే మీ పరిస్థితి ఏంటి? చట్టబద్ధంగా మీ దగ్గర ఎంత పసిడి ఉండవచ్చో మీకు తెలుసా? కొనుగోలు బిల్లులు లేని ప్రతి గ్రాము బంగారం మిమ్మల్ని చిక్కుల్లో నెట్టే ప్రమాదం ఉంది! అసలు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి? పెళ్లయిన మహిళలు, పురుషులు తమ వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చు?

ఇంట్లో బంగారం నిల్వపై పరిమితి లేదు కానీ..

చాలా మంది భారతీయులు ఇంట్లో బంగారం ఉంచుకోవడంపై ఏదో ఒక పరిమితి ఉంటుందని భావిస్తారు. కానీ, వాస్తవానికి భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండాలనే దానిపై ఎటువంటి చట్టపరమైన గరిష్ఠ పరిమితి లేదు. మీరు ఆభరణాల రూపంలో, బంగారు నాణేలు లేదా బిస్కెట్ల రూపంలో ఎంతైనా బంగారం ఉంచుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. మీరు కలిగి ఉన్న బంగారానికి సంబంధించి సరైన ఆధారాలు ఉండాలి. ఆ బంగారం కొనుగోలు చేసినా, వారసత్వంగా వచ్చినా లేదా బహుమతిగా లభించినా.. అది ఎక్కడి నుండి వచ్చిందో వివరించగలిగితే ఎంత బంగారమైనా చట్టబద్ధమే.

25
ఐటీ రైడ్ సమయంలో సీజ్ చేయకుండా బంగారం పరిమితులు ఏంటి?

ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగినప్పుడు, అధికారులకు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి. 1994, మే 11న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, నిర్దిష్ఠ పరిమితిలోపు ఉన్న బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేయకూడదు. ఆ పరిమితులు ఇవే:

  • వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకు బంగారం.
  • అవివాహిత మహిళలు: 250 గ్రాముల వరకు బంగారం.
  • పురుషులు (వివాహితులు లేదా అవివాహితులు): 100 గ్రాముల వరకు బంగారం.

ఈ పరిమితుల లోపు ఆభరణాలు ఉంటే, వాటికి సంబంధించిన కొనుగోలు బిల్లులు లేకపోయినా అధికారులు వాటిని తీసుకెళ్లరు. కేవలం డాక్యుమెంటేషన్ కోసం వాటి వివరాలను నమోదు చేసుకుంటారు.

35
పరిమితికి మించి బంగారం ఉంటే ఏం జరుగుతుంది?

పైన పేర్కొన్న పరిమితుల కంటే ఎక్కువ బంగారం కలిగి ఉండటం నేరం కాదు. ఒకవేళ మీ వద్ద అంతకంటే ఎక్కువ బంగారం ఉంటే, దానికి సంబంధించిన చట్టబద్ధమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.

1. కొనుగోలు బిల్లులు: మీరు కొనుగోలు చేసిన బంగారానికి సంబంధించిన ఒరిజినల్ ఇన్‌వాయిస్ ఉండాలి.

2. వారసత్వం: తాత ముత్తాతల నుంచి వచ్చిన బంగారమైతే, విల్లు లేదా ఇతర కుటుంబ పత్రాలు ఉండాలి.

3. బహుమతులు: బంధువుల నుంచి బహుమతిగా వస్తే దానికి సంబంధించిన వివరాలు ఉండాలి.

ఒకవేళ మీరు సరైన వివరణ ఇవ్వలేకపోతే, ఆ అదనపు బంగారాన్ని లెక్క చూపని ఆదాయంగా పరిగణించి పన్నులు, జరిమానాలు విధిస్తారు.

45
నగదు లావాదేవీలు, బంగారం కొనుగోలు నిబంధనలు ఇవే

బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆర్థిక నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని నగదు రూపంలో కొనడానికి వీల్లేదు. అంతకంటే ఎక్కువ మొత్తానికి డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లేదా చెక్కుల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. అలాగే, పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు వివరాలను సమర్పించడం తప్పనిసరి. ఇది పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య.

55
పన్నులు.. జరిమానాల వివరాలు

మీ వద్ద ఉన్న బంగారానికి సరైన ఆధారాలు చూపలేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఐటీ శాఖ కింది విధంగా పన్నులు విధిస్తుంది:

  • బంగారం విలువపై 60% ఆదాయపు పన్ను.
  • పన్ను మొత్తంపై 25% సర్‌ఛార్జ్.
  • పన్ను, సర్‌ఛార్జ్‌పై 4% సెస్.

అవసరమైతే అదనంగా 10% జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

కాబట్టి, మీరు పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు చేయించుకున్నా, ఆ ఎక్స్ఛేంజ్ రశీదులను భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

Read more Photos on
click me!

Recommended Stories