హైదరాబాద్ లో బంగారం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగువనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 98,350 గా ఉంది. మరో రూ.1,650 పెరిగితే ఇక్కడ కూడా లక్ష రూపాయలకు టచ్ అవుతుంది. అయితే ఇది ఎంతో దూరం లేదని... ఒకటిరెండు రోజుల్లో హైదరాబాద్ లో కూడా బంగారం లక్ష రూపాయల మార్కును దాటడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
అయితే లక్ష రూపాయలతో బంగారం ధర ఆగిపోదని... మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది... కాబట్టి బంగారంకు అధిక డిమాండ్ ఉంది. ధర ఎంత పెరిగినా బంగారం కొనేవారు మాత్రం తగ్గడంలేదు. అలాగే అక్షయ తృతీయ దగ్గర పడుతోంది. ఈరోజు కనీసం గ్రాము బంగారమైనా కొనాలని చాలామంది నమ్ముతారు. ఇలా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బంగారం ధర ఇదే స్థాయిలో పెరుగుతూ పోతుంటే తులం ధర రూ.1,30,000 ఈ ఏడాదిలోనే చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం అంటేనే నోరెళ్లబెడుతున్న సామాన్యులు ఏడాది చివర్లో బంగారం ధరను చూసి ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తంగా బంగారం అనేది ధనవంతుల వస్తువుగా మారిపోతోంది... పేదవాడు ఆ పేరు ఎత్తే పరిస్థితులు మెళ్లిగా దూరమవుతున్నాయి.