Gold vs copper
ఓ 50 ఏళ్ల క్రితం తులం బంగారం ధర రూ. 540 ఉండేది అంటే నమ్ముతారా. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 1975లో భారతదేశంలో తులంగా బంగారం కేవలం రూ. 540కి లభించింది. మరి ఇప్పుడు తులం ఏకంగా లక్షకు చేరింది. దీంతో ఆ సమయంలో బంగారం కొనుగోలు చేసి ఉండింటే ఈరోజు ఎంత బిందాస్‌గా ఉండేవాళ్లమన్న ఆలోచన రావడం సర్వసాధారణం.
అయితే ఇప్పుడు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసి పెట్టుకుందామన్న ఆ ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇన్వెస్టర్లు సైతం బంగారం జోలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అయితే రాగి భవిష్యత్తులో బంగారంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాగి ఏంటి, బంగారంలా మారడం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
భవిష్యత్తులో రాగి బంగారంగా మారనుందని చెప్పింది మరెవరో కాదు మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్. ఈయన రాగిని నెక్ట్స్ గోల్డ్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో రాగి ప్రాముఖ్యత భారీగా పెరగనుందని ఆయన అన్నారు.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై పెరగనున్న ప్రాధాన్యతకు సంకేతంగా ఆయన చెప్పుకొచ్చారు.
భారతీయులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అగర్వాల్ ఈ సందర్భంగా సూచించారు. రాగిపై దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. వర్ధమాన పారిశ్రామికవేత్తలు, యువ పెట్టుబడిదారులు ఆశాజనకమైన, భవిష్యత్తు ఉన్న లోహాలపై దృష్టి సారించి ఈ అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇక రాగి వంటి ముఖ్యమైన ఖనిజాలను ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్‌ను ప్రారంభించాలని కూడా ఆయన సూచించారు.
ప్రస్తుతం కాపర్ వినియోగం భారీగా పెరుగుతోందని అగర్వాల్ తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కాపర్ గనులను పునరుద్ధరించాలని అన్నారు. రాగికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఈ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మరి అగర్వాల్ చెప్పినట్లు నిజంగానే భవిష్యత్తులో రాగి మరో బంగారంగా మారనుందా తెలియాలంటే కాలమే నిర్ణయించాలి.
అనిల్ అగర్వాల్ చేసిన ట్వీట్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.