EPFO TDS Rules : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి కొత్త రూల్స్ వచ్చాయి. ఉద్యోగం మారినప్పుడు లేదా నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎంత సొమ్ము తీసుకోవచ్చో.. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
EPF విత్‌డ్రావల్ రూల్స్: ఉద్యోగం వదిలేసినా లేదా రిటైర్ అయినా డబ్బులు ఎలా తీసుకోవాలి?
మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారా? అయితే ప్రతి నెలా మీ జీతం నుండి కొంత భాగం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాకు చేరుతుంది. మీతో పాటు మీ యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని మీ పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది.
సాధారణంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ సొమ్ము అంతా ఒకేసారి చేతికి వస్తుంది. అయితే, రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగం మానేస్తే లేదా వేరే కంపెనీకి మారితే ఈ డబ్బు పరిస్థితి ఏమిటి? దీనిపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స్పష్టమైన నిబంధనలను కలిగి ఉంది.
26
రిటైర్మెంట్ సమయంలో పూర్తి సొమ్ము విత్‌డ్రావల్
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి 58 లేదా 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసినప్పుడు, అతని ఈపీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం సొమ్మును వడ్డీతో సహా ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి 58 ఏళ్ల కంటే ముందే ఉద్యోగానికి రాజీనామా చేసి, రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే కూడా తన ఖాతాలోని పూర్తి సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగం మారిన సందర్భంలో, పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
36
ఉద్యోగం కోల్పోతే ఎంత డబ్బు తీసుకోవచ్చు?
దురదృష్టవశాత్తు ఉద్యోగం పోయినా లేదా మీరు శాశ్వతంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నా, 58 ఏళ్ల లోపే పూర్తి ఈపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం, ఉద్యోగం వదిలేసిన నెల రోజుల తర్వాత మీ ఖాతాలోని 75 శాతం సొమ్మును తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన 25 శాతం సొమ్ము ఖాతాలోనే ఉంటుంది. ఒకవేళ మీరు వరుసగా రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే, అప్పుడు మిగిలిన 25 శాతం సొమ్మును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు.
పీఎఫ్ ఖాతా నుండి డబ్బు తీసేటప్పుడు పన్ను చెల్లించాలా లేదా అనేది మీరు ఎంతకాలం పనిచేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యోగి వరుసగా ఐదు ఏళ్ల సర్వీస్ పూర్తి చేయకుండానే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేస్తే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విత్‌డ్రా చేసే మొత్తం నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉంటే టీడీఎస్ కూడా వర్తిస్తుంది. అయితే, మీరు ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత పీఎఫ్ మొత్తాన్ని కొత్త ఖాతాకు బదిలీ చేస్తూ, మొత్తం సర్వీస్ ఐదేళ్లు దాటితే మాత్రం విత్‌డ్రావల్స్‌పై ఎటువంటి పన్ను ఉండదు.
56
రిటైర్మెంట్ ఫండ్ లక్ష్యం.. పీఎఫ్ బదిలీ
ఈపీఎఫ్ఓ ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల కోసం ఒక పెద్ద రిటైర్మెంట్ ఫండ్‌ను సిద్ధం చేయడం. అందుకే ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును మధ్యలోనే తీసేయకుండా ప్రోత్సహిస్తుంది. ఒక ఉద్యోగి తన కెరీర్ మొత్తంలో ఎన్ని కంపెనీలు మారినా, తన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను బదిలీ చేసుకుంటూ పోవచ్చు. ఇలా చేయడం వల్ల రిటైర్మెంట్ సమయానికి వడ్డీతో కలిపి భారీ మొత్తాన్ని పొందవచ్చు. ఐదేళ్ల నిరంతర సర్వీస్ తర్వాత డబ్బు తీసుకుంటే పన్ను మినహాయింపు లభించడం కూడా ఒక అదనపు ప్రయోజనం.
66
ఈపీఎస్ పెన్షన్ నిబంధనలు ఏమిటి?
పీఎఫ్ ఖాతాతో పాటు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన నిబంధనలు ఈపీఎఫ్ కంటే భిన్నంగా ఉంటాయి. ఒక ఉద్యోగి పదేళ్ల కంటే ఎక్కువ కాలం పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్ చేస్తే, ఆ పెన్షన్ డబ్బును మధ్యలో ఒకేసారి విత్‌డ్రా చేయడానికి వీలుండదు. అటువంటి వారు 58 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. అయితే, మీ సర్వీస్ పదేళ్ల కంటే తక్కువగా ఉండి, మీరు ఉద్యోగం వదిలేస్తే మాత్రం ఈపీఎస్ ఖాతాలోని నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.