
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కలయిక వలన ఏర్పడే యోగాలు జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. ఇవి కొన్ని రాశులకు శుభఫలితాలు ఇస్తే, మరికొన్నింటికి ప్రతికూలతలు తీసుకువస్తాయి. ఈ ఆగస్టు నెలలో సూర్యుడు తన స్వరాశి అయిన సింహ రాశిలో ప్రవేశించనున్నాడు. అయితే.. ఇప్పటికే సింహరాశిలో కేతువు సంచరిస్తున్న సందర్భంలో, సూర్యుడు-కేతువు సంయోగం ఏర్పడుతోంది. 18 ఏళ్ల తర్వాత సింహ రాశిలో దరిద్ర యోగం ఏర్పడనుంది.
జ్యోతిష్య ప్రకారం.. సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, గౌరవం వంటి సానుకూల ప్రభావాలను సూచిక అయితే.. కేతువు మాయ, అడ్డంకులు, గత కర్మలకు సూచక. ఇప్పుడు సూర్యుడు తన స్వరాశి సింహ రాశిలో ఉన్న కేతువుతో కలవడం వల్ల దరిద్ర యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, పితృదోష ప్రభావాలు, ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభావిత రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, పరిహారాలు పాటించాలి. ముఖ్యంగా ఈ 5 రాశులపై దరిద్ర యోగం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందట. ఆ రాశులు ఏవి? వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది? పరిహారాలేమిటి? అనే విషయాలు ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.
మేష రాశి వారిపై దరిద్ర యోగం, గజలక్ష్మీ రాజయోగం ప్రభావం పడబోతుంది. దీంతో ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి 5వ ఇంట్లో సూర్య–కేతువు సంయోగం ఏర్పడనుంది. దీంతో ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
అయితే ఇదే సమయంలో మిథున రాశిలో గురు–శుక్రుల సంయోగం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల కొన్ని ఆర్థిక లాభాలు, సానుకూల అవకాశాలు కూడా కలగొచ్చు. కాబట్టి మేష రాశి వారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది. దరిద్ర యోగం ప్రభావం తగ్గించుకోవడానికి కేతువు మంత్రాలు జపించటం, దానాలు చేయడం వంటి పరిహారాలు చేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
సూర్య–కేతువు కలయిక వల్ల వృషభ రాశి 4వ ఇంట్లో దరిద్ర యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావంతో పలు సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి, సమస్యలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళనలు, కొందరికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే శాంతిగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితి మెరుగవుతుంది.
కర్కాటక రాశి రెండవ ఇంట్లో సూర్య–కేతువు కలయిక వల్ల దరిద్ర యోగం ఏర్పడనుంది. దీని ప్రభావంగా గుండె, కంటి సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ప్రయాణాలు చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఒత్తిళ్లు, ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది.
అయితే లగ్నంలో బుధ–శుక్రుల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. దీని వల్ల దరిద్ర యోగం ప్రభావాలు కొంత మేర తగ్గిపోవచ్చు. ఆర్థికంగా కొన్ని అనుకూల పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయాన్ని మిశ్రమ కాలంగా పరిగణించి, ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
సింహ రాశిలో మొదటి ఇంట్లో సూర్య–కేతువు కలయిక వల్ల దరిద్ర యోగం ఏర్పడుతోంది. ఇది 18 సంవత్సరాల తర్వాత ఈ రాశిలో ఏర్పడుతున్న అరుదైన యోగం. దీని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఏ పని ప్రారంభించినా జాగ్రత్త అవసరం, ఆర్థిక, మానసిక ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంది.
పరిహారాలు: పౌర్ణమి లేదా శుక్రవారాల్లో కులదైవం, భైరవుడు, మహాలక్ష్మీ పూజ చేయండి. అలాగే.. ఆదివారాల్లో సూర్యునికి పూజ, గాయత్రీ మంత్రం జపం చేయండి. వినాయక పూజ ద్వారా మానసిక స్థిరత, అడ్డంకుల తొలగిపోతాయి.
ధనుస్సు రాశిలోని తొమ్మిదవ ఇంట్లో సూర్య–కేతువు కలయిక వల్ల దరిద్ర యోగం ఏర్పడుతోంది. దీని వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రభావాలు: గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు, గౌరవం, సమాజంలో ప్రతిష్ట తగ్గడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లో తడబాటు,
పరిహారాలు: అమ్మవారి పూజ , భైరవుడు, మహాలక్ష్మీ ఆరాధన, నవగ్రహాలకు దీపారాధన, శుక్రవారాల్లో మహాలక్ష్మీకి నెయ్యి దీపం వెలిగించి కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల దరిద్ర యోగ ప్రభావం తగ్గించి శుభ ఫలితాలు పొందవచ్చు.
(పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్‌లో లభించే సమాచారం. జ్యోతిష్యుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే. దీని విశ్వసనీయతకు ఎటువంటి హామీ లేదు. దీనికి ఆసియా నెట్ తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమాచారాన్ని కేవలం సమాచారంగా మాత్రమే తీసుకోవాలి. జ్యోతిష్య ఫలితాలు సాధారణమైనవి. మీ వ్యక్తిగత జాతకం, దశాభుక్తి, గ్రహ స్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి మంచి అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలించడం, సరైన పరిహారాలను తెలుసుకోవడం ఉత్తమం)