YS Sharmila: జగన్‌తో ష‌ర్మిల ర‌హ‌స్యంగా భేటీ అయ్యారా.? సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ

Published : Sep 22, 2026, 05:23 PM IST

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందించడంపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. జగన్‌తో తన భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని స్పష్టం చేశారు.

PREV
15
జగన్‌ను ఎందుకు కలిశానంటే..

తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకే జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్లు షర్మిల స్పష్టం చేశారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానం అందించేందుకు జగన్‌ను కలిశానని గుర్తుచేశారు. ఆ తర్వాత ఇప్పుడు కుమార్తె వివాహ పత్రిక ఇవ్వడం కోసమే మరోసారి కలిసినట్లు తెలిపారు.

తాను ఎవరినో రహస్యంగా కలుస్తున్నానని, త్వరలో మరో రాజకీయ పార్టీలో చేరబోతున్నానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన కుటుంబ వేడుకను ఉపయోగించుకుంటున్నారంటూ వస్తున్న కథనాలను షర్మిల ఖండించారు.

25
శుభకార్యాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు

కుటుంబంలో జరిగే వివాహ వేడుకకు రాజకీయ రంగు పులమడం తగదని షర్మిల పేర్కొన్నారు. తన కుమార్తె పెళ్లికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని చెప్పారు. ఇందులో అసాధారణమైన విషయం ఏమీ లేదని స్పష్టం చేశారు. తన బిడ్డ వివాహాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక రాజకీయాలు చేసే అవసరం తనకు లేదని షర్మిల అన్నారు. ఒక కుటుంబ కార్యక్రమాన్ని రాజకీయ పరిణామాలతో ముడిపెట్టి తన విశ్వసనీయతను ప్రశ్నించేలా ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

35
సోషల్ మీడియా ప్రచారంపై ఘాటు స్పందన

తాను ఎక్కడో చేరిపోతున్నానని, ఎవరో ఒకరితో రాజకీయంగా మళ్లీ కలుస్తున్నానని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను షర్మిల కట్టుకథలుగా అభివర్ణించారు. తనపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో తనకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు. రాజకీయ అంశాలకు సంబంధించిన ఊహాగానాలను వ్యక్తిగత కుటుంబ కార్యక్రమాలతో కలపవద్దని షర్మిల కోరారు.

45
అంజిలి రెడ్డి వివాహ వేడుకలు ఎప్పుడంటే..

తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహానికి సంబంధించిన కార్యక్రమాల తేదీలను కూడా షర్మిల వెల్లడించారు. సెప్టెంబర్ 24న నిశ్చితార్థం నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 25న వివాహ వేడుక జరగనుండగా.. డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు, కాబోయే వియ్యంకుల సమక్షంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఉంచినట్లు షర్మిల తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకుని వివాహ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

55
తెలుగు ప్రజలకు షర్మిల ప్రత్యేక విజ్ఞప్తి

తన కుమార్తె వివాహం సందర్భంగా తెలుగు ప్రజలందరి ఆశీస్సులను షర్మిల కోరారు. అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలని ఆకాంక్షించారు. తండ్రి ఆశీస్సులు తమ పిల్లల జీవితాలకు కొండంత అండగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్న నేపథ్యంలో.. కాబోయే నవదంపతులను తెలుగు ప్రజలు హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని షర్మిల కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories