Weather Update : వాతావరణ నిపుణుల హెచ్చరికలను బట్టి చూస్తుంటే సంక్రాంతి పండగ సమయంలో వర్షాల బెడద తప్పేలాలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయట.
IMD Rain Alert : ప్రస్తుతం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఇదే కాశ్మీర్ లో ఉష్ణోగ్రతలు పూర్తిగా కుప్పకూలి కొన్నిచోట్ల మంచు తుపానులు ఏర్పడుతున్నాయి. మరోవైపు పొరుగురాష్ట్రం తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని కొన్ని జలపాతాలు వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి... దీంతో పర్యాటకులను అనుమతించడంలేదు. దీన్నిబట్టే తమిళనాడులో ఏ స్థాయిలో వానలు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
26
ఈ జిల్లాల్లో వర్షాలు
రాబోయే రోజుల్లో ఈ వర్షాలు తమిళనాడు బార్డర్ లోని ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలకు కూడా పాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా రాయలసీమ జిల్లాల్లోనూ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
36
సంక్రాంతి వేళ వర్షాలు తప్పవా..?
సంక్రాంతి సమయంలో తమిళనాడుతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ సూచనలను బట్టి అర్థమవుతోంది. శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... ఇది వచ్చేవారం అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. దీంతో జనవరి 10, 11, 12 తేదీల్లో డెల్టా, దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి సమయంలో తమిళనాడులోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నమాట.
అయితే అల్పపీడనం బలపడితే మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి... కానీ ఇందుకు తక్కువ అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే అల్పపీడనం వాయుగుండం, తుపానుగా మారే అవకాశాలు తక్కువని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తుపాను ఏర్పడితే ఈ ప్రభావం తమిళనాడుపైనే కాదు ఆంధ్ర ప్రదేశ్ పైనా గట్టిగా ఉంటుంది.
56
తమిళనాడులో భారీ వర్షాలు
ప్రస్తుతం తమిళనాడుపై వాతావరణంలో కిందిస్థాయి ఆవర్తనం కొనసాగుతోంది. దీనివల్ల నేడు దక్షిణ తమిళనాడులో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో పొడి వాతావరణం ఉంటుంది. గత రెండు రోజులుగా తెన్కాసి, నెల్లై, తేని, నీలగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
66
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
వర్షాల సంగతి పక్కనబెడితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. గత రెండుమూడు రోజులుగా చలిగాలుల తీవ్రత కాస్త తక్కువగా ఉంది... దీంతో ప్రజలు కాస్త ఊరటగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతోంది.
తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు 5-10 డిగ్రీలకు తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో కూడా ఇలాగే ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతోంది. అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది... దట్టమైన పొగమంచు కూడా వీస్తోంది.