Tirumala Temple : తిరుమలలో పవిత్రమైన ఏడుకొండలపై వెలిసిన శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకొనేవారికి టిటిడి మరో బంపరాఫర్ ఇచ్చింది. కొంతమంది సామాన్యులకు అభిషేక దర్శనం కల్పిస్తోంది… మీరుకూడా ఈ దర్శనం పొందాలంటే ఏం చేయాలో తెలుసా?
Tirumala : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యమే అదృష్టంగా భావిస్తుంటారు భక్తులు. అలాంటిది ఏడాదికి ఒకేసారి కల్పించే వైకుంఠద్వారా దర్శనం దక్కితే... వారి ఆనందానికి అవధులుండవు. అయితే ఈ వైకుంఠద్వారం గుండా స్వామివారి నిజరూప దర్శనం పొందితే... పులకించిపోతారు, జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు. ఈ అరుదైన దర్శనమే ప్రస్తుతం కొందరు భక్తులకు దక్కుతోంది... టిటిడి నిర్ణయంతో సామాన్య భక్తులు స్వామి అభిషేక దర్శనాన్ని పొందుతున్నారు.
24
ఈ సమయంలో స్వామి దర్శనం అదృష్టమే..
తిరుమలలో డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. జనవరి 8 వరకు స్వామివారిని ఈ ద్వారం గుండానే దర్శించుకోనున్నారు భక్తులు. ఈ ఉత్తర ద్వారా గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం... అందుకే ప్రస్తుతం తిరుమలకు భక్తులు పోటెత్తారు. కేవలం నాలుగు రోజుల్లోనే లక్షలాదిమంది భక్తులు కలియుగ దైవాన్ని మోక్ష ద్వారం గుండా దర్శించుకున్నారు.
వైకుంఠద్వార దర్శనం దక్కడమే అదృష్టం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఓ నిర్ణయం కొందరు భక్తులకు వరంగా మారింది. ప్రస్తుతం భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం శ్రీవారి అభిషేక సమయంలో కూడా దర్శనాలు కల్పించాలని టిటిడి నిర్ణయించింది. దీంతో తెల్లవారుజామున 4.30 నుండి 6 గంటలవరకు స్వామివారు సామాన్య భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఇలా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి స్వామివారికి అభిషేకం జరుగుతుండగా దర్శించుకున్న భక్తులు పులకించిపోతున్నారు.
34
15 ఏళ్ళ తర్వాత అభిషేక దర్శనం...
సాధారణంగా తిరుమల వెంకటేశ్వరస్వామి అభిషేకాన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు. గతంలో ఈ అభిషేక సమయంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించేవారు... కానీ పలు కాారణాలతో ఈ సేవను ఏకాంతంగా నిర్వహించడం ప్రారంభించారు. కేవలం ముందుగా టికెట్ బుక్ చేసుకున్నవారు, సిపారసులు కలిగిన విఐపీలకు మాత్రమే ఈ సమయంలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు.
15 ఏళ్ల కింద సామాన్యులకు స్వామివారి అభిషేక దర్శనాలను నిలిపివేసింది టిటిడి. కానీ తాజాగా భక్తుల రద్దీ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమందికి దర్శనం కల్పించాలని టిటిడి భావిస్తోంది... అందుకోసమే అభిషేక సేవ సమయంలో కూడా సామాన్యులను దర్శనం కల్పిస్తోంది. ఇలా స్వామిని వేలాదిమంది అభిషేక దర్శనం చేసుకున్నారు... ఇది తమపై ఆ వైకుంఠవాసుడి కరుణగా భక్తులు భావిస్తున్నారు.
తిరుమలకు ఇప్పటికే భక్తులు పోటెత్తారు... వైకుంఠ ఏకాదశికి ముందునుండే ఈ రద్దీ కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే (డిసెంబర్ 30,31, జనవరి 1,2) దాదాపు 2.85 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నట్లు టిటిడి చెబుతోంది. ఇక ఈ వీకెండ్ లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని... సెలవులు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారని భావిస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.
వీలైనంత ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టిటిడి. ఇందులో భాగంగానే అన్నిరకాల ఆర్జిత, బ్రేక్ దర్శనాలను జనవరి 8 వరకు రద్దుచేసింది. తాజాగా అభిషేక సమయంలో కూడా దర్శనాలు కల్పిస్తోంది. ఇలా విరామం లేకుండా దర్శనాలు కల్పిస్తున్నా భక్తుల రద్దీ తగ్గడంలేదు... క్యూలైన్లలో గంటలతరబడి వేచివుండాల్సి వస్తోంది. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామి దర్శనంకోసం ఎదురుచూస్తున్నారు.