Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు, తీవ్ర ఉక్కపోత కొనసాగనుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడే ఛాన్సుంది.
భారత వాతావరణ శాఖ (IMD) పలు ప్రాంతాలకు కూల్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలపై గట్టిగా కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం.. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.
రాబోయే 2 రోజులలో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, వాయువ్య దిశగా దూసుకెళ్లనుంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏర్పడిన ఈ రెండో అల్పపీడనం వల్ల రుతుపవనాల కదలికల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
25
ఉత్తర కోస్తాకు కూల్ న్యూస్.. నేడు, రేపు మోస్తరు వానలు
వర్షాలు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడిపోతున్న టైంలో వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడనం బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు దూసుకుపోతూ, ఆ తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుంది. దీనివల్ల దేశంలోని తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పుంజుకోనున్నాయి.
35
రాయలసీమ, దక్షిణ కోస్తాలో నో ఛేంజ్.. భానుడి భగభగలు
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి గుడ్ న్యూస్ లేదు. ఈ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం అస్సలు లేదు. రానున్న ఆరేడు రోజుల పాటు ఇక్కడ పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. వేడి గాలులు, ఎండ తీవ్రత యథావిధిగా కంటిన్యూ అవుతాయి. బుధవారం బాపట్లలో 41.1°C, జంగమహేశ్వరపురంలో 41°C, తిరుపతిలో 40.6°C రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గత రెండు వారాలుగా వానలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయినా కూడా సకాలంలో వర్షాలు పడకపోవడంతో విత్తనాలు నాటే ప్రాసెస్ చాలా స్లో అయిపోయింది. మొలకెత్తిన పంటలు కూడా ఎండల తీవ్రతకు మాడిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరుణ దేవుడు కరుణించాలని నిత్యం పూజలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో వారం రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో అన్నదాతల్లో టెన్షన్ మరింత పెరిగింది.
55
తెలంగాణకు ఉక్కపోత గండం.. రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతోందంటే?
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణ కేంద్రం జూలై 15 నుంచి జూలై 22 వరకు 7 రోజుల వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదు. అక్కడక్కడా లైట్‌గా లేదా మోస్తరు వర్షాలు పడొచ్చు.
అలాగే, కొన్ని జిల్లాల్లో వేడి, తేమ వల్ల ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది. జూలై 15, 16 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.