Mudragada: 6 సార్లు ఎమ్మెల్యే, ఒక‌సారి ఎంపీ.. కాపునేత ముద్ర‌గ‌డ ఇక‌లేరు

Published : Jul 14, 2026, 07:21 PM ISTUpdated : Jul 14, 2026, 07:37 PM IST

Mudragada: కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌, మంగ‌ళ‌వారం కన్నుమూశారు.

PREV
16
రాజకీయాల్లో ప్రత్యేక స్థానం

1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇటీవలి కాలంలో శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన విశేష సేవలందించారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదం పొందిన ఆయన, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు.

26
ఏపీ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది

ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఒక ప్రముఖ నాయకుడి ప్రస్థానం ముగిసింది.

36
రాజకీయ ప్రస్థానం 1978లో ప్రారంభం

1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978లో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలోకి ప్రవేశించారు. అనంతరం 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించి ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు.

46
ఆరు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ.. రెండుసార్లు మంత్రి

ముద్రగడ పద్మనాభం తన రాజకీయ జీవితంలో మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో కూడా ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రంలో ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి పలు కీలక శాఖలను నిర్వహించారు.

56
కాపు ఉద్యమానికి ప్రధాన స్వరం

రాజకీయ నాయకుడిగానే కాకుండా కాపు సామాజిక వర్గ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేతగా ముద్రగడ ప్రత్యేక గుర్తింపు పొందారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఈ పోరాటాల కారణంగా ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా కాపు వర్గంలో విశేష ఆదరణ లభించింది.

66
వైసీపీలో చేరిక.. పేరు మార్పుతో వార్తల్లో నిలిచిన నేత

2024 ఎన్నికలకు ముందు ముద్రగడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తన పేరును 'ముద్రగడ పద్మనాభ రెడ్డి'గా మార్చుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో తన మాటకు కట్టుబడి అధికారికంగా గెజిట్ ద్వారా పేరును మార్చుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు, ప్రజల్లో చాలా మంది ఆయనను ముద్రగడ పద్మనాభ రెడ్డి పేరుతోనే ప్రస్తావించడం ప్రారంభించారు.

కుటుంబం, రాజకీయ వర్గాల్లో విషాదం

ముద్రగడ పద్మనాభం వయసు 73 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాపు సంఘాల ప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజా ఉద్యమాలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories