బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఈ జిల్లాల్లో వర్ష బీభత్సమే, విద్యాసంస్థలకు సెలవు

Published : Oct 22, 2025, 07:20 AM IST

Deep Depression over Bay of Bengal : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతూ వాయుగుండం దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.. కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 

PREV
19
తెలుగు రాష్ట్రాల్లో ఇక కుండపోతే...

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మెళ్లిగా ప్రారంభమైన వర్షాలు ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో ఊపందుకుంటున్నాయి. ఇకపై వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ నుండి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. ఈ వారం మొత్తం పరిస్థితి ఇలాగే ఉంటుందని... భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

29
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు... విద్యాసంస్థలకు సెలవు

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు (అక్టోబర్ 22, బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వర్షతీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయట.. అలాగే తిరుపతి, కడప జిల్లాల్లోనూ కుండపోత తప్పదంటోంది. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్తగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ... తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో పరిస్థితిని బట్టి సెలవుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

39
అత్యవసర సాయంకోసం టోల్ ఫ్రీ నెంబర్లు

ఇప్పటికే భారీ వర్షాలు నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ఎన్డిఆర్ఎస్, ఎస్డిఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో వరదలు, లేదంటే పిడుగులు, ఈదురుగాలులతో ఏదైనా ప్రమాదం ఏర్పడితే వెంటనే సాయం కోసం కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 కు పోన్ చేయాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.

49
గురువారం అత్యంత భారీ వర్షాలు

రేపు (అక్టోబర్ 23, గురువారం) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇలా కొన్నిజిల్లాల్లో కురిసే అతిభారీ వర్షాలతో నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహించడం... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారిపోవడంతో వరదలు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది APSDMA.

59
వాయుగుండం దిశగా కదులుతున్న అల్పపీడనం

ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ముందుకు కదులుతూ గురువారం మధ్యాహ్నానికి రూపం మార్చుకుంటుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది తర్వాత 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సమయంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

69
రాబోయే ఐదురోజులు వానలే

రాబోయే 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

79
తెలంగాణలో వర్షాలే వర్షాలు

తెలంగాణలో ఇవాళ (బుధవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలుంటాయని తెలిపింది.

89
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

అయితే రేపు (అక్టోబర్ 23, గురువారం) తెలంగాణలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని... హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

99
ఓవైపు వానలు... మరోవైపు చలి

తెలంగాణలో వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ లో 19.4 డిగ్రీ సెల్సియస్.... అత్యధికంగా భద్రాచలంలో 33 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్నిజిల్లాల్లో అత్యల్పంగా 20 నుండి 25 డిగ్రీ సెల్సియస్, అత్యధికంగా 29 నుండి 33 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Read more Photos on
click me!

Recommended Stories