IMD Alert : కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల విపరీతమైన చలిగాలులు, కొన్నిచోట్ల తీవ్ర పొగమంచు… తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Weather Update : శీతాకాలం మొదలై నెలరోజులు కావస్తోంది... అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో వానలు కొనసాగుతున్నాయి... ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షతీవ్రత ఎక్కువగా ఉంది. దిత్వా తుపాను పూర్తిగా బలహీనపడినా దీని ప్రభావంతో ఏపీలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
25
ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఇవాళ (ఆదివారం, డిసెంబర్ 07న) దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకు చలిగాలులు తోడవుతాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని... గజగజలాడించే చలి మొదలవుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది.
35
తెలంగాణను గజగజా వణికిస్తున్న చలి
తెలంగాణ విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు లేవు... ఇదే సమయంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని... ఊహకందని స్థాయిలో చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చలినుండి రక్షణ పొందేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని... ముఖ్యంగా చిన్నారులు, ముసలివారు, శ్వాస సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల , సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని... 5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది... ప్రమాదకర స్థాయిలో చలి ఉంటుందని ప్రజలకు హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయట... దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
55
తెలంగాణలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
ఇవాళ (డిసెంబర్ 07, ఆదివారం) తెల్లవారుజామున తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 9.2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమోదయ్యింది. ఇక సంగారెడ్డి జిల్లాల్లో కూడా 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 10.6, మెదక్ జిల్లా నార్లాపూర్ లో 11.2 డిగ్రీ సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయి గడ్డకట్టే చలి ఉంది. హైదరాబాద్ లో కూడా చలితీవ్రత ఎక్కువగా ఉంది... శివారు ప్రాంతాల్లో విపరీతమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.