IMD Cold Wave Alert : తెలంగాణపై మళ్లీ చలి పంజా విసురుతోంది... రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని... ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయి ఎముకలు కొరికే చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... మరింత పడిపోయే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
26
తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
ఇవాళ (శనివారం, డిసెంబర్ 6) తెల్లవారుజామున కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... 6 AM కు 8.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఇక నార్త్ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్... వెస్ట్ తెలంగాణ జిల్లాలు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ లో కూడా ఇలాగే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. మిగతా జిల్లాల్లోనై 10-15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వెదర్ మ్యాన్ తెలిపారు.
36
హైదరాబాద్ అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..
హైదరాబాద్ విషయానికి వస్తే రాజేంద్ర నగర్ లో అత్యల్పంగా 12.3 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమోదైందని తెలిపారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లో 14-16°C ఉష్ణోగ్రతలున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. నగరంలో కంటే శివారుప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది... కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే చలిగాలులు మొదలయ్యాయి... ఆరంభంలోనే ఇలాఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత చలి ఉండనుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు భయపడుతున్నట్లు వాతావరణ పరిస్థితులు ఉంటాయని... విపరీతమైన చలి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే నాలుగైదు రోజులు దక్షిణ తెలంగాణ జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని... చలి తారాస్థాయికి చేరుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
56
తెలంగాణ వాతావరణం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం... ఇవాళ (శుక్రవారం) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 10.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మెదక్ లో 11.3, హన్మకొండలో 13.5, రామగుండంలో 14.2, దుండిగల్ లో 14.9, నిజామాబాద్ లో 15.2, హకీంపేటలో 15.5. నల్గొండలొ 16, హహబూబ్ నగర్ లో 16.5, ఖమ్మంలో 16.6, భద్రచలంలో 17.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
66
హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ విషయానికి వస్తే రాజేంద్రనగర్ లో అత్యల్పంగా 12.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. బేగంపేటలో 15.6, హయత్ నగర్ లో 14, పటాన్ చెరు ఈక్రిశాట్ లో 13 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కూడా హైదరాబాద్ లో ఆకాశం మేఘాలతో కమ్ముకుని ఉంటుందని... రాత్రి సమయంలో పొగమంచు పడుతుందని వెల్లడించింది.