IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మరి మొంథా తుపాను మాదిరిగా సెన్యార్ ఎఫెక్ట్ తో స్కూళ్లకు సెలవులు వస్తాయా?
IMD Rain Alert : బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి... దీంతో చలి కాస్త తగ్గి వానలు మొదలవుతాయని వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. ఇలా వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలకు కారణం అవుతాయని చెబుతోంది. ఇదే జరిగితే మరోసారి తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
26
సెన్యార్ తుపాను గండం
వాతావరణ నిపుణులు ప్రకటన చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ కు మరో తుపాను గండం పొంచివుందని అర్థమవుతోంది... మొంథా మాదిరిగానే 'సెన్యార్ తుపాను' కూడా ఇక్కడే తీరందాటే అవకాశాలున్నాయట. ఇదే జరిగితే ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు తప్పవు... కొన్నిచోట్ల కుండపోత కూడా ఉండే అవకాశాలుంటాయి. దీంతో మొంథా సమయంలో మాదిరిగానే ముందుజాగ్రత్త చర్యగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ఇవ్వవచ్చు.
36
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు (నవంబర్ 22, శనివారం) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది ముందుకు సాగుతూ మరింత బలపడుతుందని... ఆదివారం (నవంబర్ 23) కు తీవ్ర అల్పపీడనంగా, సోమవారం (నవంబర్ 24) కు వాయుగుండంగా మారే అవకాశాలున్నాయట. ఆ తర్వాత 48 గంటల్లో అంటే బుధ లేదా గురువారం (నవంబర్ 26, 27) ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలున్నయంటోంది.
ఇలా ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారే క్రమంలో భారీ వర్షాలు తప్పేలా లేవు. ఈ సెన్యార్ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయట. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోనే తీరం దాటే అవకాశాలున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తప్పవంటున్నాయి వాతావరణ విభాగాలు.
ప్రస్తుతం వరికోతల సమయం... అలాగే వివిధ వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో కురిసే వర్షాలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. రాబోయే వారంరోజులు వర్షాలు కురుస్తాయి కాబట్టి తెలుగు రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు కాదు భారీ వర్షాలుంటాయని అర్ధమవుతోంది. కాబట్టి విద్యాసంస్థలకు కూడా ముందుజాగ్రత్తగా సెలవులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
56
ఈ ఏపీ జిల్లాల్లో నేటినుండే వర్షాలు
శనివారం (నవంబర్ 22న) దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతాజిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం ఉంటుందని... ఆకాశం మేఘాలతో కప్పేసి ఉంటుందని తెలిపింది. ఒకటి రెండు చోట్ల కాస్త గట్టిగానే వర్షం కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
66
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వరుసగా మూడ్రోజులు (నవంబర్ 23, 24, 25) వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.