
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి. వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారడంతో అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో దంచికొడుతున్నాయి. కొన్నిజిల్లాల్లో అయితే కుండపోత వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రమాద హెచ్చరికలు జారీచేయడం, కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించడం, ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు పరిస్థితిని సమీక్షించడం చూస్తుంటేనే ఏస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు. కొన్నిచోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తూ అతలాకుతలం చేస్తున్నాయి.
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇవాళ(శుక్రవారం) ఇదే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం అల్పపీడనంగా మారుతుందని... తర్వాత 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహన సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త వచ్చే సోమవారం వరకు వాయుగుండంగా మారే అవకాశాలున్నాయట. దీంతో సోమ, మంగళవారం భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది విపత్తు నిర్వహణ సంస్ధ.
ఉపరితల ఆవర్తనం, వాయుగుండాల ప్రభావంతో ఇవాళ(శుక్రవారం) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనాల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు మరికొద్దిరోజులు వేటకు వెళ్ళరాదని సూచించింది విపత్తు నిర్వహణ సంస్థ.
ఆంధ్ర ప్రదేశ్ భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల్లో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని నిర్దేశించారు. ఇక మంత్రులు నిమ్మల రామానాయుడు, వంటలపూడి అనిత కూడి వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు....క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అలెర్ట్ గా ఉండాలని సూచించారు.
తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ (అక్టోబర్ 24, శుక్రవారం) ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , వనపర్తి, నారాయణపేట్ , జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక భద్రాద్రి కొత్తూగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాబ్ , వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. అక్కడక్కడ ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో (గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. అత్యల్పంగా మెదక్ జిల్లాలో 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక హైదరాబాద్ హయత్ నగర్ లో 21, ఆదిలాబాద్ లో 21.7 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. అత్యధికంగా రామగుండంలో 34 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. మిగతా అన్ని జిల్లాల్లో అత్యల్పంగా 20 నుండి 25 డిగ్రీ సెల్సియన్... అత్యధికంగా 29 నుండి 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.