Ration Shops - Mini Malls: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ షాపులు ఇకపై మినీ మాల్స్‌గా మారబోతున్నాయి. బియ్యం, ధాన్యాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా రోజంతా అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీంతో మీరు నిత్యావసరాల కోసం ఇకపై సూపర్ మార్కెట్లకు వెళ్లాల్సిన పనిలేదు. మీకు సమీపంలోనే అన్ని సరుకులు దొరుకుతాయి. ఎందుకంటే రేషన్ షాపులు మీని మాల్స్ గా మారబోతున్నాయి.
రేషన్ షాపులు ఇకపై కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలు కాకుండా, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే మినీ మాల్స్‌గా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుకు 12 గంటలపాటు ఈ షాపులు తెరిచి ఉంచేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాల్లో ఈ కొత్త విధానం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానుంది.
26
రేషన్ షాపులను మినీ మాల్స్ గా మార్చడానికి కారణం ఏమిటి?
ఇప్పటి వరకు రేషన్ షాపులు నెలలో 1 నుండి 15 వరకు మాత్రమే ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుండి 8 వరకు తెరిచి ఉండేవి. అనేక ప్రాంతాల్లో డీలర్లు సమయానికి షాపులు తెరవకపోవడం, లబ్ధిదారులు ఇబ్బందులు పడడం సాధారణమైపోయింది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం మినీ మాల్స్ విధానాన్ని రూపొందించింది. ఇప్పుడు ఈ దుకాణాలు రోజంతా సుమారు 12 గంటలపాటు తెరిచి ఉంటాయి. మరిన్ని సరుకులు అందుబాటులో ఉంటాయి.
36
మినీ మాల్స్‌లో అందుబాటులో ఉండే వస్తువులు ఏమిటి?
రేషన్ షాపులను మినీ మాల్స్ గా మార్చిన తర్వాత కేవలం బియ్యం మాత్రమే కాకుండా, పిండి, పప్పులు, చక్కెర, నూనె, మసాలా పదార్థాలు, అలాగే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ సరుకులను జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ (NAFED), గిరిజన కార్పొరేషన్ ద్వారా సరఫరా చేయనున్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా స్థానిక ఉత్పత్తిదారులకు మార్కెట్ అవకాశాలు కూడా ఈ విధానం ద్వారా లభిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, ప్రజలకు దగ్గరలోనే అన్ని వస్తువులు లభిస్తాయని వెల్లడించారు.
మినీ మాల్స్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభిస్తారు?
తొలి దశలో రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాలైన రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికయ్యాయి. ఒక్కో నగరంలో 15 చొప్పున మొత్తం 75 రేషన్ షాపులను మినీ మాల్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపులను ఈ విధానంలోకి మార్చే అవకాశం ఉంది.
56
డీలర్లకు ఉపాధి, ప్రజలకు సౌకర్యం
ఇప్పటి వరకు డీలర్లు రోజులో కొద్ది గంటలే పనిచేసి మిగతా సమయాన్ని ఇతర పనులకు వినియోగించేవారు. ఇకపై వారు రోజంతా షాపుల్లో ఉండాల్సి ఉంటుంది. దాంతో వారికి స్థిర ఉపాధి లభిస్తుందనే అంచనా ఉంది. ప్రజలకు కూడా ఎప్పుడైనా వెళ్లి రేషన్ లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సౌకర్యం లభిస్తుంది. ఇది లబ్ధిదారులకు భారీగా అనుకూలంగా మారనుంది.
66
రాయితీల సంగతేంటి?
ప్రస్తుతం ప్రభుత్వం ఈ వస్తువులను స్వయంగా కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే తెచ్చుకుంటారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అలాగే నిత్యావసర వస్తువులపై రాయితీ ఇస్తారా లేదా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం, ఈ కొత్త విధానం పారదర్శకతను పెంచడమే కాకుండా, రాష్ట్రానికి సంవత్సరానికి సుమారు ₹385 కోట్లు ఆదా చేయగలదని అంచనా.
రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌గా మార్చే ఈ ప్రణాళిక ప్రజలకు మరింత సౌకర్యం, డీలర్లకు స్థిర ఉపాధి, ప్రభుత్వానికి పారదర్శకతను తెస్తుందని అభిప్రాయపడ్డారు. బియ్యం తోపాటు పోషకాహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాలు అందుబాటులోకి రావడంతో, పౌర సరఫరాల వ్యవస్థలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోందన్నారు.