వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ అసలు స్టోరీ ఇదేనా? ఇవే సాక్ష్యాలా?

Published : Oct 23, 2025, 10:47 PM IST

YS Jaganmohan Reddy : విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుగురించి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ కట్టుకథలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటున్నారు. అసలు స్టోరీ ఇదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
గూగుల్ డేటా సెంటర్ నావల్లే వైజాగ్ కి : వైఎస్ జగన్

YS Jaganmohan Reddy : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో 'గూగుల్ డేటా సెంటర్' గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని బీచ్ సిటీ విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది... స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు, గూగుల్ ప్రతినిధుల సమక్షంలో దేశ రాజధాని డిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ డేటా సెంటర్ కోసం గూగుల్ ఏకంగా 1,33,000 కొట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది... అమెరికా బయట గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే.

ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. మరీముఖ్యంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ ల పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇలాంటి సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తనదేనంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు, కృషి వల్లే ఇప్పుడీ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని అంటున్నారు. అసలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు దీంతో సంబంధమే లేదని... కానీ అంతా తామే చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేవలం మాటలు కాదు గూగుల్ డేటా సెంటర్ కోసం తనవల్లే ఎలా వచ్చిందో కూడా వైఎస్ జగన్ వివరించారు. కానీ ఈ క్రెడిట్ కొట్టేయడానికి ప్రస్తుత సీఎం పరిపాలనను గాలికి వదిలేసి ఓ యాడ్ ఏజెన్సీని నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వెనకున్న అసలు స్టోరీని బైటపెడుతున్నానని వైఎస్ జగన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

25
గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కు ఎలా వచ్చిందో చెప్పిన జగన్

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు బీజం పడింది ఇప్పుడు కాదు... 2020 కరోనా టైంలో అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ సంవత్సరం వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని... 2021 లో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ కూడా రాశామని.. సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు చర్చలు జరిగాయన్నారు. 2023 లో డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేసినట్లు మాజీ సీఎం తెలిపారు.

ఈ అదానీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్ అని... ఇందులో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అదానీ గ్రూప్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని... ఈ సంస్థకు చెందిన కంపెనీలే గూగుల్ డేటా సెంటర్ ను నిర్మించనున్నాయని జగన్ తెలిపారు. అదానీ, గూగుల్ కు మధ్య మంచి వ్యాపార సంబంధాలున్నాయి... అందువల్లే గూగుల్ వైజాగ్ కు వస్తోందన్నారు వైఎస్ జగన్.

ఇలా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కృషిచేసింది గత వైసిపి ప్రభుత్వం... అలాగే కేంద్రం, సింగపూర్, అదానీ గ్రూప్ తమకు పూర్తిగా సహకరించాయని జగన్ అన్నారు. గతంలో వైసిపి వేసిన బీజానికి కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్... కానీ ఈ క్రెడిట్ ను చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నారన్నారు. గూగుల్ డేటా సెంటర్ వెనకున్న అదానీ సంస్థ పేరు కూడా చంద్రబాబు ఎత్తడంలేదు... అలాచేస్తే వైసిపికి గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ దక్కుతుందని భయపడుతున్నాడని వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
గూగుల్ డేటా సెంటర్ తో ఉద్యోగాలు రావా?

కూటమి ప్రభుత్వం, టిడిపి నాయకులు చెబుతున్నట్లు గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాలు రావని వైసిపి నాయకులు అంటున్నారు... ఇదేమాట ఆ పార్టీ అధినేత కూడా అంటున్నారు. అయితే ఈ డేటా సెంటర్ వల్ల ఐటీ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని... దీంతో భవిష్యత్ లో కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వైఎస్ జగన్ అన్నారు. కానీ ఈ డేటా సెంటర్ వల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు రావని జగన్ అభిప్రాయపడ్డారు.

డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని తెలిసికూడా అదానీతో ఒప్పందం చేసుకుంది కూడా భవిష్యత్ బాగుంటుందనే అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేశామన్నారు. ఇలా భారీ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చే గూగుల్ డేటా సెంటర్ వెనక చాలా స్టోరీ ఉందని వైఎస్ జగన్ తెలిపారు.

45
సైబరాబాద్ నిర్మాణంలో కూడా చంద్రబాబుది బిల్డప్పే...

హైదరాబాద్ లో ఐటీ డెవలప్మెంట్ తనవల్లే అంటూ చంద్రబాబు చెప్పుకోడాన్ని కూడా జగన్ తప్పుబట్టారు. సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిందేమీలేదు... కానీ ఇతరకు క్రెడిట్ మొత్తం కొట్టేసి అంతా తానే చేశానని చెప్పుకుంటున్నాడని అన్నారు. హైటెక్ సిటీ కి పునాది వేసింది మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి... ఇందులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదన్నారు. కానీ సైబరాబాద్ ను నిర్మించానని బిల్డప్ ఇచ్చుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ డెవలప్మెంట్ తన తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. అధికారిక లెక్కలు కూడా 2003-04 నుండే నగర అభివృద్ధి ఊపందుకుందని.. తర్వాత వైఎస్సార్ లేకున్నా ఇది కొనసాగిందని చెబుతున్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ హయాంలో హైదరాబాద్ మరింత డెవలప్మెంట్ జరిగింది. కానీ ఎవ్వరికీ క్రెడిట్ ఇవ్వకుండా అసలేమీ సంబంధంలేని చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి తనవల్లే జరిగిందని చెప్పుకోవడం దారుణమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

55
బాలకృష్ణపైనా జగన్ సీరియస్ కామెంట్స్

సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణపైనా వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తూ... తాగిన మైకంలో బాలకృష్ణ అలా మాట్లాడారని అన్నారు. అసెంబ్లీకి తాగిరావడంతో పాటు మాజీ ముఖ్యమంత్రినైన తనగురించి నోటికొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ఈ మాటలను బట్టే బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుందంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తాగినోడిని పవిత్రమైన అసెంబ్లీలో ఎలా రానిచ్చారు.. ముందు అసెంబ్లీ స్పీకర్ కు బుద్దిలేదని మండిపడ్డారు జగన్. అసెంబ్లీలో పనీపాట లేని సంభాషణలకు కేంద్రంగా మార్చారని జగన్ ఆరోపించారు.

Read more Photos on
click me!

Recommended Stories