వాయుగుండం కాదు తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాలకు కుండపోత వర్షగండం, గురువారం స్కూళ్లకు సెలవేనా?

Published : Oct 22, 2025, 01:40 PM IST

IMD Rain Alert : ఉపరితలం ఆవర్తనం కాస్త అల్పపీడనంగా… ఇది కాస్త వాయుగుండంగా మారుతోంది. ఇంతటితో ఆగకుండా ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగామారి తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

PREV
16
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

IMD Cyclone Alert : తెలుగు రాష్ట్రాల్లో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి... గత రెండ్రోజులుగా వాతావణం ఇలాగే ఉంటోంది. కొన్నిజిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతుండటంతో మిగతా జిల్లాలకు కూడా ఈ వర్షాలు పాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా వర్షాకాలం ముగిసినా ఏ ఆగస్ట్, సెప్టెంబర్ లోనో కురిసినట్లు కుండపోత వానలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ (IMD).

26
ఈ తెలుగు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందా?

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 22) ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు... రేపు గురువారం (అక్టోబర్ 23) వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ సెలవులు కొనసాగే అవకాశాలున్నాయి. భారీ నుండి అతిభారీ వర్షసూచనలున్న మరికొన్ని జిల్లాల్లోనూ విద్యార్థుల పేరెంట్స్ నుండి సెలవు డిమాండ్ వినిపిస్తోంది... మరి ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

బుధవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోనూ స్థానిక పరిస్థితులను బట్టి విద్యాశాఖ అధికారులు సెలవులపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూ వరద పరిస్థితులు ఏర్పడే ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు సెలవులు ఇస్తున్నారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ప్రమాదకంగా ప్రవహిస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.

36
అల్పపీడనం బలపడి వాయుగుండం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. ఇది ముందుకు కదులుతూ 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు ఇది కదులుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల కుండపోత వానలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. అలాగే దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇక వాయుగుండం, తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇంకా ఏ స్థాయిలో వర్షాలు కురుస్తాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. రేపు (గురువారం, అక్టోబర్ 23న) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కాబట్టి ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులుండే అవకాశాలున్నాయి. జిల్లాలో పరిస్థితిని బట్టి కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు సెలవులపై నిర్ణయం తీసుకుంటారు.

46
భారీ వర్షసూచనలతో సర్కార్ హై అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హై అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు, ఇకపై కురిసే అతిబారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపధ్యంలో APSDMA అధికారులతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు... సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.

వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదని సూచిస్తోంది విపత్తు నిర్వహణ సంస్థ. సహయక చర్యలకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. భారీ వర్షసూచనలున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేయాలని.. 24/7 అలెర్ట్ గా ఉండాలని సూచించారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.

భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని APSDMA అధికారులకు హోంమంత్రి అనిత సూచించారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్ లు పంపాలని ఆదేశించారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని ప్రజలకు సూచించారు. వర్ష సమయంలో సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి సూచించారు. .

56
ఈ జాగ్రత్తలు పాటించండి

1. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అందుకే వర్షం కురిసే సమయంలో ఎవ్వరూ చెట్లకింద తలదాచుకోరాదు. ముఖ్యంగా పొలంపనులు చేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలి.

2. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పెద్దపెద్ద హోర్డింగ్స్, స్తంభాలు కూలిపోయి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే చెట్లు కూడా విరిగిపడవచ్చు. కాబట్టి వర్ష సమయంలో ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు.

3. భారీ వర్షాలతో వరదలు సంభవించి అవకాశం ఉంటుంది. కాబట్టి నదులు, చెరువుల సమీపంలో నివాసముండేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.

4. వాగులు వంకలు పొంగిపోర్లి వంతెనలపైకి, రోడ్లపైకి నీరు చేరవచ్చు. ఇలా ప్రమాదకరంగా ప్రవహించే నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం అస్సలు చేయరాదు.

5. వరదలు సంభవిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాలి. ప్రభుత్వం కూడా వరద ప్రభావిత ప్రజల కోసం పునరావాస ఏర్పాట్లు చేస్తోంది.

66
తెలంగాణలో కూడా భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి... వాయుగుండం ప్రభావంతో ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. రేపు (అక్టోబర్ 23, గురువారం) తెలంగాణలో భారీ వర్షాలుంటాయని... ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది. ఇలా భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులుండే అవకాశాలున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకుని ముందుగానే ప్రకటిస్తారు.

ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లోనూ మేఘాలతో ఆకాశం కమ్మేసి ఉంటుందని... వాతావరణం చల్లబడి అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories