Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే

Published : Jan 18, 2026, 07:57 AM IST

Sankranti Return rush: సంక్రాంతి సంబురం ముగిసిపోయింది. చ‌దువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ర‌క‌ర‌కాల ప‌నుల‌తో హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌జ‌లు పండుగ‌కు త‌మ సొంతూర్ల‌కు వెళ్లారు. సెల‌వులు పూర్తి కావ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ సిటీకి ప‌య‌ణ‌మ‌వుతున్నారు. 

PREV
15
న‌గ‌రం బాట పట్టిన జనం

సంక్రాంతి పండగ వేడుకలు ముగియడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కారణంగా హైదరాబాద్‌ వైపు భారీగా వాహనాలు కదలడంతో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసింది. ఆదివారం అమావాస్య కావడం వల్ల ఎక్కువ మంది శనివారమే బయల్దేరారు. దీంతో ఉదయం నుంచే మొదలైన రద్దీ సాయంత్రం నుంచి రాత్రి వరకు తీవ్రంగా కొనసాగింది. ఉమ్మడి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు ఒకేసారి హైదరాబాద్ దారిలోకి చేరడంతో ట్రాఫిక్ తీవ్రత పెరిగింది.

25
గుంటుపల్లి–ఇబ్రహీంపట్నం మధ్య తీవ్ర జాప్యం

గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రింగు కూడలి వరకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు గంటన్నర సమయం పట్టింది. రింగు కూడలి వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఒక వైపు, మైలవరం, తిరువూరు దిశగా మలుపు తిరిగే వాహనాలు మరోవైపు చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. జాతీయ రహదారిపై కార్లు వరుసగా నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు కూడా ముందుకు కదలలేని స్థితి ఏర్పడింది. గొల్లపూడి నుంచి నందిగామ వరకు సర్వీస్ రోడ్లు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ హైవే వైపు మళ్లే వాహనాలకూ తీవ్ర ఆలస్యం తప్పలేదు.

35
కీసర టోల్ ప్లాజా, నందిగామ వద్ద కొనసాగిన రద్దీ

కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 20 వేల వాహనాలు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఎనిమిది టోల్ కౌంటర్లు తెరిచినా ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కారణంగా వాహనాలు పొడవైన వరుసల్లో నిలిచాయి. నందిగామ వైజంక్షన్ దగ్గర సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించడంతో ముందుకు సాగేందుకు ఎక్కువ సమయం పట్టింది. అక్కడి ఫ్లైఓవర్ మీదుగా కార్లను మాత్రమే అనుమతించడంతో మిగతా వాహనాలకు మరింత జాప్యం ఏర్పడింది.

45
ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు అప్రమత్తం

ట్రాఫిక్ నియంత్రణ కోసం ఉన్నతాధికారులు నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు రహదారులపై మోహరించారు. సాయంత్రం సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణ ప్రయాణికుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. డ్రోన్ల ద్వారా రహదారులపై పరిస్థితిని నిరంతరం గమనించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపారు. నందిగామ వైజంక్షన్ వద్ద వేగం తగ్గించే స్టాపర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

55
ప్రైవేటు ట్రావెల్స్‌కు డిమాండ్

సంక్రాంతి ప్రభావంతో రవాణా వ్యవస్థలపై భారీ ఒత్తిడి ఏర్పడింది. రైళ్లలో రిజర్వేషన్లు దొరకకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు లభించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పిల్లలతో ప్రయాణించాల్సిన కుటుంబాలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కొన్ని మార్గాలకే పరిమితం కావడంతో పల్లె వెలుగు బస్సుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో జనం పడిగాపులు కాశారు. పండుగ ముందు వరకు వెలవెలబోయిన బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు ఒక్కసారిగా జనంతో నిండిపోయాయి.

ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లేందుకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు కార్ల అద్దెలు కూడా గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఒక కుటుంబం హైదరాబాద్ చేరేందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Read more Photos on
click me!

Recommended Stories