PM Kisan 22nd Installment : ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడతను విడుదల చేయనున్నారు. ఏపీలో అన్నదాత సుఖీభవ కలిపి రైతులకు రూ. 6,000 నేరుగా ఖాతాల్లో జమకానున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతుల నిరీక్షణకు తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 22వ విడత నిధులను మార్చి 13వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. అస్సాం రాజధాని గువహటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బటన్ నొక్కి దేశవ్యాప్తంగా ఉన్న 9.32 కోట్ల మంది రైతులకు రూ. 18,640 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ. 2,000 చొప్పున అందుతాయి.
25
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్: ఒకేసారి రూ. 6,000
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ విడత మరింత ప్రత్యేకంగా మారనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే రోజు (మార్చి 13న) కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం వద్ద 'పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ' మూడవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ గువహటిలో నిధులు విడుదల చేసిన వెంటనే, సీఎం చంద్రబాబు ఏపీలోని 46.8 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2,808 కోట్లను బదిలీ చేస్తారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ. 2,000 తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000 ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి జమ కానుంది.
35
అర్హత ఉన్నవారు వీరే.. ఈ-కేవైసీ తప్పనిసరి
పీఎం కిసాన్ 22వ విడత ప్రయోజనం పొందాలంటే రైతులు తమ వివరాలను అధికారిక పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఈ-కేవైసీ (e-KYC), బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి రికార్డుల సీడింగ్ పూర్తయి ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికే ఫేస్ అథెంటికేషన్ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రైతులు ఓటీపీ లేదా బయోమెట్రిక్ పరికరాలు లేకుండానే ఇంట్లో కూర్చుని ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. అక్రమ లబ్ధిదారులను తొలగించి, నిజమైన రైతులకు మాత్రమే ఈ సాయం అందేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా.. స్టేటస్ చెక్ చేసే విధానం
రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:
1. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in సందర్శించండి.
2. హోమ్ పేజీలో 'Farmer Corner' విభాగంలో 'Beneficiary Status' పై క్లిక్ చేయండి.
3. మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంచుకోండి.
4. ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
5. 'Get Report' పై క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్, అర్హత వివరాలు కనిపిస్తాయి.
55
పీఎం కిసాన్ : సూరంపల్లిలో భారీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కృష్ణా జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. సూరంపల్లి సమీపంలోని మాదాల వారి గూడెంలో బహిరంగ సభ జరగనుంది. సుమారు 3,000 మంది రైతులు ఈ సభకు హాజరవుతారని అంచనా. భద్రతా పరంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం, అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
పీఎం కిసాన్: రైతులకు గొప్ప సాయం
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 మూడు విడతల్లో అందజేస్తారు. ఇప్పటివరకు 21 విడతల్లో కలిపి మొత్తం రూ. 4.09 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. రేపు విడుదల కానున్న 22వ విడతతో ఈ మొత్తం రూ. 4.27 లక్షల కోట్లు దాటనుంది. 22వ విడత లబ్ధిదారులలో సుమారు 2.15 కోట్ల మంది మహిళా రైతులు ఉండటం విశేషం.