Pawan Kalyan: మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, విభూతి పెట్టుకొని బడికి వెళ్లేవాడినని తెలిపారు. అలాగే, హిందువుగా గర్వంగా ఉన్నాననీ, అన్ని మాతాలను గౌరవిస్తానని తెలిపారు.
మురుగన్ విశ్వాసం జీవితాన్ని మార్చగలదు : పవన్ కళ్యాణ్
Pawan Kalyan speaks on Murugan faith: మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. మురుగన్ భక్తిపై తన గాఢమైన నమ్మకాన్ని ప్రకటించారు. ఆయన హిందూ ధర్మాన్ని, మత గౌరవాన్ని, భారతీయ సంస్కృతిని వివరంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మురుగన్ భక్తి మార్గం మనకు శక్తిని ఇస్తుందని తెలిపారు.
“మురుగన్‌ను నమ్మితే విజయం నిశ్చితం. ఎదుగుదల సుసాధ్యం. లేచి నిలబడే శక్తి మనకు వస్తుంది. కంద శష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది, మన జీవితాన్ని మధురంగా మారుస్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పవన్ తన ప్రసంగంలో ఉదాహరణగా ఒక నాగుపాము శబ్దంతో ఎలుకలు పారిపోయే దృశ్యాన్ని పేర్కొన్నారు. “ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే అవి పరుగు తీయాలి. అలాగే మన శత్రువులు ఎంత మంది ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలో ఉన్న నాగుని చూసి పారిపోతారు. మార్పు ఖచ్చితంగా వస్తుంది” అన్నారు.
26
నకిలీ సెక్యులరిజం పై పవన్ విమర్శలు
“ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ముస్లిం కూడా గౌరవించవచ్చు. కానీ హిందువు గౌరవిస్తే మాత్రం అభ్యంతరమా? ఇది అసలైన నకిలీ సెక్యులరిజం” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్ తన ప్రసంగంలో 14వ శతాబ్దపు చారిత్రక పరిణామాలను ప్రస్తావించారు. “మధురై ధ్వంసమైంది. మీనాక్షి ఆలయం మూసివేశారు. ఎందుకంటే మాలిక్ కఫూర్ దాడి చేశాడు. 60 సంవత్సరాల పాటు అక్కడ పూజలు జరగలేదు” అని తెలిపారు. అయితే, “విజయనగర యువరాజు కుమార కంబణన్ మళ్లీ ఆలయంలో తెరిచి వెలుతురులు నింపారు” అని పేర్కొన్నారు.
36
ధర్మాన్ని ఎవరూ నిలువరించలేరు : పవన్ కళ్యాణ్
“మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం లోతైనది” అని పవన్ కళ్యాణ్ అన్నారు. మురుగన్ భక్తిని, ధర్మాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. అలాతే, మురుగన్ పిలుపు వల్లే తాను మధురైకి వచ్చానని పవన్ అన్నారు.
“నన్ను మధురైకి పిలిచింది మురుగన్. నన్ను పెంచింది మురుగన్. నాకు ధైర్యాన్ని ఇచ్చింది మురుగన్. వేట్రివేల్ మురుగన్‌కు ఆరోగారా, వీరవేల్ మురుగన్‌కు ఆరోగారా” అని పవన్ నినదించారు.
తన బాల్యంలో శబరిమల యాత్రను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్.. తాను 16వ యేట శబరిమలకు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. “పదహారేళ్ల వయసులో శబరిమల వెళ్లాను. థైపూసం సందర్భంగా తిరుత్తణిలో భక్తుల సంద్రాన్ని చూశాను. విభూతి పెట్టుకొని స్కూల్‌కు వెళ్లేవాడిని” పవన్ అన్నారు.
హిందువుగా గర్వంగా ఉన్నానన్న పవన్
“నేను హిందువుగా పుట్టాను. హిందువుగా జీవిస్తున్నాను. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను. ఇది నా హక్కు. మీరు నా నమ్మకాన్ని అవమానించకండి” అని పవన్ కళ్యాణ్ కోరారు. మహాకవి భారతీయర్ చెప్పిన “అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే” అనే వాక్యాన్ని ఉదహరించి ధైర్యాన్ని వ్యక్తపరిచారు.
ధైర్యమే మార్పుకు మూలమని పవన్ అన్నారు. “మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కష్టాన్ని ఆపేస్తే కాలం ఆగదు. కొందరి కుంచిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుంది” అని పవన్ స్పష్టం చేశారు.
56
తమిళనాడు సంస్కృతిపై గౌరవం
తమిళ సంస్కృతి విషయాలు మాట్లాడుతూ.. “ఒక తెలుగు కవి చెప్పిన అద్భుతమైన మాటలు... మనిషి ఒక నడిచే చెట్టు లాంటి వాడు. అతని కాళ్లు వేర్లు, అవి నేలతో ఉంటాయి. కానీ అతని ఆలోచనలు, అతని చైతన్యం అంతా పరవశించాలి. నా వేర్లు ఆంధ్రాలో ఉన్నా, నా హృదయం మధురై వైపు పారుతోంది” అని అన్నారు. అలాగే, మధురైలో, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.
66
జనసేన ప్రస్థానం.. రాజకీయ నేపథ్యం పై పవన్ ఏమన్నారంటే?
“2014లో హైదరాబాద్‌లో పార్టీ స్థాపించాను. కానీ నేను తమిళనాడులో పెరిగాను. తమిళ సంస్కృతిని అర్థం చేసుకున్నాను. గౌరవించాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రసంగం ద్వారా ఆయన ధర్మంపై, సంస్కృతిపై తన మక్కువను వెల్లడించారు.
పవన్ ప్రసంగం మురుగన్ భక్తుల మధ్య విశేషంగా ఆకట్టుకుంది. పవన్ ప్రసంగంలోని చారిత్రక అంశాలు, వ్యక్తిగత అనుభవాలు, మత గౌరవం పట్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.