Published : Jun 16, 2025, 11:39 AM ISTUpdated : Jun 16, 2025, 11:41 AM IST
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనంస పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్య ఆగకూడదన్న లక్ష్యంతో ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి రూ. 13,000 చొప్పున నేరుగా తల్లి ఖాతాలో డబ్బు జమ చేశారు. నిజానికి రూ. 15 వేలు కాగా, రూ. 2 వేలు స్కూలు నిర్వహణకు అందించారు.
25
ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి
గతంలో వైసీపీ అమ్మ ఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే డబ్బులు అందించారు. కానీ చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ డబ్బు జమా చేశారు.
35
ఒకే ఇంటిలో 12 మంది లబ్ధిదారులు
అన్నమయ్య జిల్లాలోని కలకడ గ్రామానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబంలో ఒక్కసారిగా 12 మంది పిల్లలకు నగదు జమ కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కలకడకు చెందిన హసీనుల్లాకు నలుగురు కొడుకులు కాగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న నలుగురు తల్లుల సంతానం 12 మందికి తల్లికి వందనం కింద రూ.1.56 లక్షలు లభించాయి. నసీన్, బి.ముంతాజ్, ఇరానీ, ఆసియా అనే తల్లుల ఖాతాల్లో డబ్బు జమ కావడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఇలా ఒకే కుటుంబానికి రూ. 1.56 లక్షలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరు ఉమ్మడి కుటుంబం కావడంతో అన్ని నిధులు ఒకే ఇంటికి వెళ్లినట్లు అనిపిస్తోంది. వేరు వేరు కుటుంబాలకు కూడా ఇలాగే లబ్ధిచేకూరిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
55
టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు
ఇక తెలుగు దేశం పార్టీ అధికారిక X (Twitter) ఖాతాలో ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ప్రచారం ముమ్మరం చేస్తోంది. ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు వచ్చాయని తెలిపే మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.