సముద్రంలోంచి భూమిపైకి చేరిన మొంథా .. ఇక ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే, తస్మాత్ జాగ్రత్త

Published : Oct 29, 2025, 07:33 AM IST

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం నుండి వాయుగుండంగా… దాన్నుండి తుపాను, తీవ్ర తుపానుగా మారిన మొంథా ఎట్టకేలకు ఏపీ తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 

PREV
16
తీరం దాటిన మొంథా తుపాను

Cyclone Montha : ఎట్టకేలకు మొంథా తుపాను గత రాత్రి తీరం దాటింది. మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్ధ తెలిపింది. ఇది బుధవారం ఉదయానికి తీవ్ర తుపాను నుండి తుపానుగా బలహీనపడుతుందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు (అక్టోబర్ 29) పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

26
ఏపీలో భారీ వర్షాలు

బుధవారం శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA ప్రకటించింది. కాబట్టి ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలని... తగిన జాగ్రత్తగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

36
అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు

మొంథా తుపాను తీరందాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయన్న విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. పలుమార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. ఇలా మంగళవారం రాత్రి తుపాను తీరందాటిన తర్వాత పరిస్థితి ప్రశాంతంగానే ఉందని తెలుసుకుని  ఆర్టిజిఎస్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు. ఇక నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే ఉండి పరిస్ధితులను సమీక్షించారు.

46
అత్యధిక వర్షపాతం ఇక్కడే

గత రాత్రి ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఉలవపాడు, కావలిలో 170 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఇక దగదర్తి 155 మిమి, సింగరాయకొండ 120 మిమి, ఒంగోలు 104 మియీ, నెల్లూరు 100 మిమి వర్షం కురిసింది. బి. కొండూరు 61, చీరాల 58 మిమి, కలింగపట్నం 21 మిమి, విశాఖపట్నం 10మిమి, తుని 21మిమి, కాకినాడ 6 మిమీ, తిరుపతి 16 మిమీ వర్షపాతం నమోదయ్యింది. ఇక తుపాను తీరందాటాక కాకినాడలో గంటకు 73 కిలోమీటర్లు, రాజమండ్రిలో గంటకు 39 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

56
తెలంగాణలో వర్షాలు

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు (5 నుండి 15 మిమీ) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఈ జిల్లాల్లో 41 నుండి 61 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

66
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఇక హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి తో పాటు జనగాం, జోగులాంబ గద్వాల్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాద్రాద్రి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories