ఈ ప్రయోగం వల్ల దేశానికి వచ్చే ఉపయోగాలు మామూలుగా లేవు. EOS-05 అనేది ఒక నెక్స్ట్-లెవెల్ భూ పరిశీలన ఉపగ్రహం. భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోసింక్రోనస్ ఆర్బిట్ లో స్థిరపడే తొలి భారతీయ ఇమేజింగ్ శాటిలైట్ ఇది.
రక్షణ రంగంలో విప్లవం: సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్లు ఒకే ప్రాంతాన్ని ఫొటో తీయడానికి రోజులు లేదా వారాల సమయం తీసుకుంటాయి. కానీ EOS-05 అలా కాదు.. భూస్థిర కక్ష్యలో ఉంటూ మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో కవర్ చేస్తుంది. ప్రతీ 10 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే హై-రిజల్యూషన్ చిత్రాలను పంపుతుంది. అవసరమైతే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఫొటోలు తీసి సరిహద్దుల్లో శత్రువుల కదలికలను రియల్ టైమ్‌లో పసిగడుతుంది.
విపత్తుల ముందస్తు అలర్ట్: వరదలు, సైక్లోన్లు, కొండచరియలు విరిగిపడటం, కార్చిచ్చు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో సమాచారం అందిస్తుంది. సహాయక చర్యలు వేగవంతం చేయడానికి ఇది సూపర్ గైడ్‌లా పనిచేస్తుంది.
వ్యవసాయం, పర్యావరణం: పంటల ఆరోగ్యం, భూమిలో తేమ శాతాన్ని, సాగు విస్తీర్ణాన్ని కచ్చితత్వంతో అంచనా వేస్తుంది. అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి వనరుల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తుంది.