IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, తర్వాత అల్పపీడనం, ఆతర్వాత వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయట.
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం, భారీ వర్షాలు, వరదలు... ఇలాంటి పదాలు వర్షాకాలం ఆరంభంలో లేదా మధ్యలో వినిపిస్తుంటాయి. కానీ నైరుతి రుతపవనాలు దేశాన్ని వీడినా.. వర్షాకాలం ముగిసి శీతాకాలంలోకి ఎంటర్ అయినా ఇంకా భారీవర్షాల భయం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో నేడు (అక్టోబర్ 21, మంగళవారం) అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షాకాలం ఆరంభంలో వానలకోసం ఎదురుచూసిన ప్రజలే ఆగస్ట్, సెప్టెంబర్ ముగిసేనాటికి ఇవేం వానల్రా బాబు అనుకున్నారు అంటే ఆస్థాయిలో వర్షాలు కురిశాయి... అక్టోబర్ లోనూ ఈ వర్షాలు కొనసాగుతున్నాయి.
27
బంగాళాఖాతంలో వాయుగుండం
ప్రస్తుతం దక్షిణ అండమాన్ కి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లోపు (మంగళవారం రాత్రివరకు) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తర్వాత మరో 48 గంటల్లో (అక్టోబర్ 22 బుధవారం లేదా 23 గురువారం) అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు.
37
తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త
దక్షిణమధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడవచ్చని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, పాటు తెలంగాణలోనూ భారీ నుండి అతిభారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు ఈవారం అప్రమత్తంగా ఉండాలని... రైతులు వ్యవసాయ పనుల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని... మరో నాలుగైదురోజులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది IMD.
అక్టోబర్ 21 (మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇక మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
57
దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది APSDMA.ముఖ్యంగా దక్షిణకోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
67
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే ఈ రెండురోజులు చాలాప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని... అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఈవారాంతం (గురు, శుక్ర, శనివారాలు) ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కి.మీ వేగం) కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
77
వణికిస్తున్న చలి
ఇక తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్ 18.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తర్వాత మెదక్ లో అత్యల్పం 19.8 డిగ్రీ సెల్సియస్. అత్యధిక ఉష్ణోగ్రతలు మాత్రం నిజామాబాద్ లో 33.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. హైదరాబాద్ తో సహా మిగతా అన్ని జిల్లాల్లో 20-25 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.